
- వివాదాస్పదమవుతున్న రికవరీ వ్యవహారం
- ఆందోళనలో బాధితులు
- కలెక్టర్ కు, ఎమ్మెల్యేకు ఫిర్యాదులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో మళ్లీ మైక్రో ఫైనాన్స్ లొల్లి మొదలైంది. రెండేండ్ల క్రితం పెద్దఎత్తున కార్యకలాపాలు సాగించి వివాదాల్లో కూరుకుపోయి కనుమరుగైన మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ యాక్టివ్అయ్యాయి. పలు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొంతకాలంగా చాప కింద నీరులా జిల్లాలో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఆ సంస్థలకు చెందిన సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లోని స్లమ్ ప్రాంతాల్లో కొంతమంది మహిళా పొదుపు సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి సహకారంతో ఇతర మహిళలకు రుణాలు అంటగడుతున్నారు. మొదట్లో అతి తక్కువ వడ్డీ అని చెప్పి రుణాలు అంటగట్టే ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు.. ఆ తర్వాత కిస్తీల రూపంలో వారి నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారు.
రికవరీ కోసం స్పెషల్ టీమ్‌లు
జిల్లాలో కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు అమాయక మహిళలకు అవసరం లేకున్నా రుణాలు ఇచ్చి వారి నుంచి కిస్తీల పద్ధతిలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఒకటి రెండు రోజులు వడ్డీ చెల్లింపులు ఆలస్యమైతే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తూ వారి నుంచి ముక్కు పిండి డబ్బులను వసూలు చేస్తున్నాయి. రుణాలు రికవరీ చేసేందుకు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించుతున్నారు. ఈ సిబ్బంది ఉదయమే రుణాలు తీసుకున్న వారి ఇంటికి వెళ్లి వసూళ్ల కోసం హంగామా చేస్తున్నారు. అధిక వడ్డీపై ప్రశ్నిస్తే సంస్థల ప్రతినిధులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అసలుతోపాటు వడ్డీలు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ మహిళలను బెదిరిస్తున్నారు.
బెదిరించడంతో కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదులు
నాలుగైదు రోజుల క్రితం నిర్మల్పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని మహిళలు, వారి కుటుంబసభ్యులతో రికవరీ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. వారిని బెదిరించడం స్థానికంగా దుమారం రేపింది. మూడు రోజుల క్రితం శాంతినగర్‌కు చెందిన దాదాపు వంద మంది మహిళలు కలెక్టర్ లభిలాష అభివన్‌కు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, తమను రుణ విముక్తులను చేయాలని కోరారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతుండడం, వారిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
►ALSO READ | కండ్లు మూసినా.. మెడ తిప్పినా అలారం మోగుతది: ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ