అంతరిక్షంలో కాన్పులు చేస్తరట…

అంతరిక్షంలో కాన్పులు చేస్తరట…

మరో12 ఏండ్లలోపే తొలి ‘స్పేస్ బేబీ’కి పురుడు పోస్తాం

‘స్పేస్ బోర్న్ యునైటెడ్’ కంపెనీ రీసెర్చర్ల ప్రకటన 

 

ఇప్పటిదాకా పెండ్లిళ్లను భలే వెరైటీగా చేసుకునేటోళ్లను చూసినం. నీళ్లలో, గాలిలో జరిగిన పెండ్లిళ్ల గురించి విన్నాం. ఇక ఫలానా తేదీలో, ఫలానా టైంలోనే.. అని  ‘ప్లాన్’ చేసుకుని మరీ బిడ్డల్ని కన్నోళ్లను కూడా చూసినం. ఇప్పుడు వీటన్నింటికి మించి ఇంకా వెరైటీగా తాము గర్భిణీలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి మరీ కాన్పులు చేయిస్తామంటున్నారు ‘స్పేస్ బోర్న్ యునైటెడ్’ అనే స్టార్టప్ కంపెనీ ఓనర్! అంతా అనుకున్నట్లే జరిగితే మరో 12 ఏండ్లలోనే అంటే.. 2031 నాటికి తొలి ‘స్పేస్ బేబీ’కి పురుడు పోస్తామని  చెబుతున్నారు. ఇటీవల జర్మనీలో ‘అస్గార్డియా ద స్పేస్ నేషన్’ పేరుతో జరిగిన స్పేస్ అండ్ సైన్స్ కాంగ్రెస్‌లో స్పేస్ బోర్న్ కంపెనీ ఫౌండర్, సీఈవో డాక్టర్ ఎగ్బెర్ట్ ఎడెలబ్రోక్ ఈ ముచ్చటను బయటపెట్టారు. తాము చేపట్టనున్న మిషన్‌కు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు.

36 గంటల్లో కాన్పు

మహిళలను ప్రెగ్నెన్సీ పొందినప్పటి నుంచి కాన్పు పూర్తయ్యే వరకూ అంతరిక్షంలోనే ఉంచడం చాలా కష్టం కాబట్టి.. స్పేస్ బోర్న్ మిషన్‌ను 24 నుంచి 36 గంటలకు కుదించారట. ఆల్రెడీ కాన్పు అయ్యేందుకు దగ్గరైన మహిళలనే అంతరిక్షానికి తీసుకెళ్లి సేఫ్‌గా డెలివరీ చేయించి తిరిగి తల్లీబిడ్డలను తీసుకొచ్చి అప్పగిస్తామని కంపెనీ రీసెర్చర్లు చెబుతున్నారు. స్పేస్ డెలివరీకి ఎంపిక చేసే ప్రెగ్నెంట్‌లకు ముందుగా అనేక పరీక్షలు చేస్తామని, జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. అంతేకాదు.. ఆల్రెడీ రెండుసార్లు నార్మల్ డెలివరీ అవడంతో పాటు నేచురల్ రేడియేషన్‌ను తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉన్న మహిళలనే ఈ స్పేస్ డెలివరీకి ఎంపిక చేస్తారట.

నాసా ఎలుకలకు కాన్పులు సక్సెస్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1997లో ప్రెగ్నెంట్ ఎలుకలపై అంతరిక్షంలో ప్రయోగం చేసింది. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లోనూ ఎలుకలకు సేఫ్​గా డెలివరీలు అయ్యాయని వెల్లడించింది. అయితే భూమిపై వచ్చే పురిటినొప్పులతో పోలిస్తే.. అంతరిక్షంలో రెట్టింపు నొప్పులు వచ్చే అవకాశముందని తమ ప్రయోగంలో తేలినట్లు తెలిపింది. అంతరిక్షంలో డెలివరీ సందర్భంగా ఎలుకలకు భూమిపై కంటే రెండు రెట్లు ఎక్కువగా కాంట్రాక్షన్స్ వచ్చాయని వివరించింది.

తొలి స్పేస్ బేబీ రష్యనే కావాలె

‘‘అంతరిక్షంలో మేం ఎల్లప్పుడూ ముందే ఉన్నాం. అలాగే అంతరిక్షంలో పుట్టే తొలి బిడ్డ కూడా రష్యా సిటిజెనే అయి ఉండాలనుకుంటున్నాం” అంటూ రష్యన్ సైంటిస్ట్ డాక్టర్ ఇరినా ఆగ్నేవా గత జూన్‌ నెలలో అన్నారు. రష్యాలోని సెల్ బయోఫిజిక్స్ ఇనిస్టిట్యూట్ ల్యాబ్ చీఫ్​గా పనిచేస్తున్న ఆగ్నేవా కూడా అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ, డెలివరీల వంటి అంశాలపై రీసెర్చ్ చేస్తున్నారు. పరిశోధనల కోసం అంతరిక్షంలో ఉన్నప్పుడు తమ వ్యోమగాములను స్పెర్మ్ డొనేట్ చేయాలని కోరగా, వారు ఒప్పుకోలేదని ఆమె చెప్పారు. అయితే అంతరిక్షంలో పిల్లలు పుట్టడం ముఖ్యం కాదని, వారు పూర్తి ఆరోగ్యంగా పుట్టడమే ముఖ్యమని ఆమె అన్నారు. ఈ దిశగా పరిశోధనల్లో తామే ముందు ఉన్నామని చెప్పారు. కానీ అంతరిక్షంలో డెలివరీలకు ఇంకా ఎంతకాలం పడుతుంతో  చెప్పలేమన్నారు.

ఒక్కో ట్రిప్‌‌‌‌లో 30 మందికి చాన్స్

మొదట్లో మెడికల్ స్టాఫ్​ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ ప్రకారం, లో ఎర్త్ ఆర్బిట్ లోనే ఈ స్పేస్ డెలివరీలు నిర్వహిస్తామని ఎగ్బెర్ట్ చెప్పారు. ఐవీఎఫ్​క్లినిక్స్ లో మాదిరిగా పురిటినొప్పులను ప్రేరేపించి, డెలివరీ చేసేందుకూ చాన్స్ ఉంటుందన్నారు. అయితే, వాతావరణం బాగాలేకపోయినా, టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ వాయిదా పడినా చాలా నష్టపోవాల్సి వస్తుందని, అందుకే ఒక్కో విడతలో ఒక్కరినే కాకుండా కనీసం 30 మంది మహిళలను తీసుకెళతామని చెబుతున్నారు. లో ఎర్త్ ఆర్బిట్ లో కాన్పులకు పెద్దగా రిస్క్ ఏమీ ఉండదని తమ ఎక్స్ పర్ట్ లు భావిస్తున్నారని ఎగ్బెర్ట్ పేర్కొన్నారు. అయితే తమ కంపెనీ డెవలప్ అయి, రీసెర్చ్ పూర్తయి, మిషన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలంటే చాలా డబ్బు అవసరమని, అందుకే 12 ఏండ్ల టైం పడుతుందని భావిస్తున్నామన్నారు. అప్పటికి స్పేస్ టూరిజం డెవలప్ అయితేనే, ధనవంతులు ఈ మిషన్ పట్ల ఆసక్తి చూపవచ్చన్నారు. ప్రస్తుతానికి అంతరిక్షంలో గర్భం ధరించడం, పిండాన్ని అభివృద్ధి చెందించడం వంటి రీసెర్చ్ లపైనే తాము ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు.