బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైంది..మహిళా రిజర్వేషన్ బిల్లుపై : ప్రధాని మోదీ

బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైంది..మహిళా రిజర్వేషన్ బిల్లుపై :  ప్రధాని మోదీ
  •     ఈ బిల్లుతో మహిళల గౌరవం పెరిగింది
  •     మూడు దశాబ్దాలుగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయ్
  •     చట్టసభల్లో బిల్లు కాపీలు చించినోళ్లే మద్దతిచ్చేలా చేశాం
  •     మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి
  •     మోదీకి సన్మానం చేసిన బీజేపీ మహిళా మోర్చా నేతలు

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో భారీ మెజార్టీతో పాస్ కావడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బిల్లు సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. కేంద్రంలో ఉన్న బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం కారణంగానే మూడు దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్​సభ,  
రాజ్యసభలో ఆమోదం పొందడం సాధ్యమైందని చెప్పారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళలకు వినమ్రంగా నమస్కారం పెట్టి మాట్లాడారు. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), సమాజ్​వాదీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్​ను వ్యతిరేకించాయని అన్నారు. బిల్లుల కాపీలను చించేసి.. మహిళలను అగౌరవపర్చాయని విమర్శించారు. కానీ, ఈ సారి తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాం

మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి ముందు నుంచే మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని మోదీ అన్నారు. అన్ని పార్టీలు వీటికి మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని సందర్భాల్లో తాము మహిళల అభ్యున్నతి గురించే ఆలోచించామని, ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ హయాంలో బిల్లు పాస్ కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఈ బిల్లుపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

కొన్ని నిర్ణయాలు దేశ గతిని మారుస్తాయ్..

కొన్ని నిర్ణయాలు దేశం గతి, విధిని మారుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. రిజర్వేషన్ బిల్లు మహిళల్లో కొత్త ఆత్మవిశ్వాసం నింపుతుందని తెలిపారు. సెప్టెంబర్ 20, 21వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. లోక్​సభ, రాజ్యసభలో బిల్లు పాస్ కావడం చరిత్రాత్మకం అన్నారు. కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు అవకాశం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందన్నారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం పదేండ్లలో ఎన్నో స్కీమ్​లు ప్రవేశపెట్టినట్లు మోదీ తెలిపారు. 

అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

ఫ్యామిలీ నుంచి పంచాయత్ వరకు, ఎకానమీ నుంచి ఎడ్యుకేషన్, ఎంటర్​ప్రెన్యూర్ షిప్ వరకు అన్నింట్లో తమ అక్కాచెల్లెళ్లు, బిడ్డలు రాణిస్తున్నారని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ నిషేధం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి నిర్ణయాలతో ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీతో పాటు పలువురు మహిళా ఎంపీలు, మహిళా మోర్చా లీడర్లు పాల్గొన్నారు.