- ఉమ్మడి మెదక్ జిల్లాలో 68 మండల సమాఖ్యలు
- ఒక్కో సమాఖ్యకు ఒకటి చొప్పున 68 బస్సులు కొనుగోలు
- ఒక్కో బస్సుకు నెలకు రూ.70వేల ఆదాయం
మెదక్/ సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. స్వయం ఉపాధి పథకాల కోసం బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలు అందజేయడంతోపాటు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం సమకూర్చేందుకు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి లీజ్‌కు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మొదటి దశలో 150 బస్సులు కొనుగోలు చేసి లీజ్ కు ఇవ్వగా, రెండో దశలో మరో 450 కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 68 సమాఖ్యలకు బస్సులు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 మండల సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో మహిళా సమాఖ్యకు ఒక బస్ చొప్పున మొత్తం రూ.24.48 కోట్లతో 68 బస్ లను కొనుగోలు చేయాలని గ్రామీణాభివృద్ధి సంస్థ(సెర్ప్) నిర్ణయించింది. ఒక్కో బస్ కొనుగోలుకు రూ.36 లక్షలు అవసరం. కాగా ఇందులో మండల సమాఖ్య సభ్యులు తమ వంతు వాటాగా ఒక్కో బస్ కు రూ.6 లక్షల చొప్పున చెల్లించగా, మిగతా రూ.30 లక్షలు సెర్ప్ చెల్లించింది.
మెదక్ జిల్లాలో 20 మండల సమాఖ్యలు ఉండగా 20 బస్సులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్ కొనుగోలుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.7.20 కోట్లు ఆర్టీసీకి చెల్లించారు. సిద్దిపేట జిల్లాలో 23 మండల సమాఖ్యలకు గానూ 23 బస్సుల కొనుగోలుకు రూ.8.28 కోట్లు చెల్లించారు. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలకొక బస్సు చొప్పున 25 కొనుగోలు కోసం ఆర్టీసీకి రూ.9 కోట్లు చెల్లించారు.
నెలకు రూ.70 వేల చెల్లింపు
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులను ఆర్టీసీ డిపోలకు అద్దెకు ఇచ్చారు. ఇందుకు ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతి నెలా రూ.70 వేలకు పైగా అద్దెను సంబంధిత మండల సమాఖ్యలకు చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని ఏ నెలకానెల ఆయా మండల సమాఖ్యల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాలో మండల సమాఖ్యల బస్సులు రాగా ఆయా జిల్లాల పరిధిలోని సమీప బస్ డిపోలకు అలాట్ చేశారు. ఎక్కువ శాతం ఎక్స్‌ప్రెస్ బస్సులే ఉన్నాయి. ఆ బస్సులపై సెర్ప్ లోగో ముద్రించడంతోపాటు, ఆయా మండల సమాఖ్య సౌజన్యంతో అని రాశారు.
మహిళా సమాఖ్యలకు మెరుగైన ఆదాయం
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మండల సమాఖ్యలకు ఒక్కో బస్ కొనుగోలుకు చర్యలు చేపట్టాం జిల్లాలోని 20 మండల సమాఖ్యలకు బస్సుల కోసం ఆర్టీసీకి రూ.7.20కోట్లు చెల్లించాం. ఇటీవలే కొత్త బస్సులు రాగా మెదక్, నర్సాపూర్ డిపోలకు అలాట్ చేశాం. అద్దె రూపంలో ప్రతి బస్సుకు నెలకు రూ.70 వేల చొప్పున మహిళా సమాఖ్యలకు అందనుంది. తద్వారా మహిళలకు మెరుగైన ఆదాయం సమకూరనుంది. -శ్రీనివాస్ రావ్, డీఆర్డీవో, మెదక్
