
- బైక్ ను ఢీకొట్టిన కారు
- ఎస్సైతో పాటు మరొకరు దుర్మరణం
- జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరులో ఘటన
గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో జగిత్యాల డీసీఆర్బీ ఎస్సై శ్వేత, మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(26) చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సై శ్వేత స్వగ్రామమైన చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి డ్యూటీ కోసం జగిత్యాలకు కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రైవేట్ బ్యాంక్ లో పని చేస్తున్న మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన నరేశ్ బైక్ పై వస్తున్నాడు.
చిల్వాకోడూరు గ్రామం దాటగానే ఎదురుగా వస్తున్న బైక్ ను కారు ఢీకొని అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. డెడ్‌బాడీలను పోలీసులు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్ పరిశీలించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన శ్వేత 2020లో ఎస్సైగా సెలక్ట్ అయ్యారు. ప్రొబేషనరీ ఎస్సైగా గొల్లపల్లిలో పని చేసిన ఆమె ఆ తరువాత పెగడపల్లి, వెల్గటూర్, కోరుట్లలో ఎస్సైగా పని చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ కాగా, ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్సైగా డ్యూటీ చేస్తున్నారు.