
కోడేరు, వెలుగు: 20 రోజులుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలకు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్దకొత్తపల్లిలోని 167 కె జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బ తినడం వల్ల తమకు తాగునీరు రావడం లేదని బాధితులు వాపోయారు.
వారికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ విషయమై మిషన్ భగీరథ డీఈ ఎండీ.అమ్జద్పాషా ను సంప్రదించగా రెండు రోజుల్లో అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామన్నారు.