పోటీకి మహిళా లీడర్లు ఆసక్తి .. అవకాశాలు అంతంతే

పోటీకి మహిళా లీడర్లు ఆసక్తి .. అవకాశాలు అంతంతే
  • అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీకి మహిళల ఆసక్తి
  • బీఆర్ఎస్​ సిట్టింగులకే  కేటాయించడంతో అక్కడ నో ఛాన్స్​

నిజామాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పొలిటికల్ ​పార్టీల తరఫున పోటీ చేయడానికి మహిళా లీడర్లు ఆసక్తి చూపుతున్నా.. అవకాశాలు అంతంతే కనిపిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ సిట్టింగులపై టికెట్లు కేటాయించడంతో అందులో పోటీ ఛాన్స్ కోసం ప్రయత్నించినా మహిళలకు నిరాశే మిగిలింది. త్వరలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో అతివలకు ఏ మేరకు అవకాశాలు వస్తాయోననే అంశం ఆసక్తిగా మారింది.​

టికెట్​ఇస్తే మంత్రి సోదరి రెడీ..

మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి సోదరి వేముల రాధికారెడ్డి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఆఫీసర్​గా పనిచేస్తున్న ఆమె ఆర్మూర్/ బాల్కొండ టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమంటూ స్టేట్ కాంగ్రెస్ లీడర్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్​గ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన రాధికారెడ్డి మహిళా కోటా నుంచి ఛాన్స్​ ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో ముఖ్య లీడర్​గా వెలుగొంది, 

ఆ మధ్య మృతి చెందిన బాల్కొండ నియోజకవర్గ లీడర్​ఆలూరు గంగారెడ్డి కూతురు ఆలూరు విజయభారతి  రాజకీయాలపై ఆసక్తితో కమలంలో కొనసాగుతున్నారు. ఆలూరు గంగారెడ్డి తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీల్లో  జిల్లా ప్రెసిడెంట్​గా పనిచేశారు.  ఆయన రాజకీయ వారసురాలిగా విజయభారతి బాల్కొండ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రేమలత అగర్వాల్ అర్బన్​లో  పోటీకి ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

జుక్కల్​ నుంచి మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున 1999లో పోటీ చేసి గెలిచిన అరుణతార బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. కమలం పువ్వు గుర్తుపై జుక్కల్​బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.  ఉమ్మడి నిజామాబాద్​లో మహిళలే అధికంఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో పురుష జనాభా 14,02,067 కాగా మహిళలు 14,57,545 ఉన్నారు. 9,37,246 పురుష ఓటర్లు ఉండగా, వారి కంటే అధికంగా 10,24,427 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జనాభా పరంగా, ఓటర్ల పరంగా మహిళలే అధికంగా ఉన్నారు. 

ఛాన్స్​దక్కక నిరాశలో..

ఉమ్మడి జిల్లాలో ఈ సారి బీఆర్ఎస్ ​టికెట్ ​ఆశించిన మహిళా లీడర్లు ఎక్కువగానే ఉన్నారు. అధిష్టానం సిట్టింగుల వైపే మొగ్గు చూపడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 2018 ఎలక్షన్​లో ఆర్మూర్​ నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీ చేసి ఓడిన ఆకుల లలిత అనంతరం బీఆర్ఎస్​లో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంఘం చైర్​పర్సన్​గా వ్యవహరిస్తున్నారు. ఈసారి లలిత నిజామాబాద్​ అర్బన్​పై నజర్ ​పెట్టారు. ఛాన్స్​రాదని తేలిపోవడంతో నిరాశలో ఉన్నారు.

 కామారెడ్డి మున్సిపల్ ​చైర్​పర్సన్ ​నిట్టు జహ్నవి గులాబీ టికెట్​ ఆశించారు. ఏకంగా సీఎం కేసీఆరే అక్కడి నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించడంతో ఆమె కూడా సైలెంటయ్యారు. బోధన్ ​మున్సిపల్ ​చైర్​పర్సన్ ​తూము పద్మ కూడా టికెట్​ ఆశించి ఎమ్మెల్సీ కవితకు తన అభిమతాన్ని తెలిపారు. ఎమ్మెల్యే షకీల్​ ఆమేర్​భార్య అయేషా ఫాతిమా సైతం పోటీకి సై అంటూ పబ్లిక్​ రిలేషన్స్ ​పెంచుకున్నారు. సీఎం కేసీఆర్​ కూతురు ఎమ్మెల్సీ కవిత బోధన్ ​లేక ఎల్లారెడ్డి సెగ్మెంట్లలో  ఏదో ఒక చోట పోటీకి దిగుతారనే విపరీత ప్రచారం జరిగింది. హైకమాండ్​ అన్ని చోట్లా సిట్టింగులనే ఖరారు చేయడంతో  బీఆర్ఎస్​ నుంచి ఏ మహిళా లీడర్​కు ఛాన్స్​ దక్కలేదు.