జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమే : ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమే : ఒమర్ అబ్దుల్లా

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా, చట్టపరంగా పోరాడతామని నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా రీసెంట్ గా చెప్పారు. శాంతియుతంగా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తాను రైట్ వింగ్ నేషనలిస్టిక్ పొలిటిషియన్ ను కాదని చెప్పిన అబ్దుల్లా.. కాశ్మీర్ భవిష్యత్ ను ఇండియాలో అంతర్భాగంగా చూడని వాళ్లలోనూ తాను లేనన్నారు. రీసెంట్ గా లాంచ్ చేసిన ఇండియా టుమారో: కన్వర్జేషన్స్ విత్ ది నెక్స్ట్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ అనే పుస్తకానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం అబ్దుల్లాను 232 రోజులు నిర్బంధించింది. ఇది తనకు కోపం తెప్పించిందన్నారు.

‘జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమే. నా నిర్బంధంతోపాటు గతేడాది  ఆగస్ట్ 5న జరిగిన పరిస్థితులు నా ఆలోచనా ధోరణిని మార్చేశాయి.
అన్ని రకాల విషయాలు, పరిస్థితులను బేరీజు వేసుకున్నాక ఇండియాతో సత్సంబంధాలు లేకుండా జమ్మూ కాశ్మీర్ కు భవిష్యత్ ఉండబోదనే నిర్ధారణకు వచ్చా. రైట్ వింగ్ నేషనలిస్ట్ పొలిటీషియన్స్ లో నేను లేను. అదే సమయంలో భారత్ తో కాశ్మీర్ భవిష్యత్ ను ఊహించలేని కాశ్మీరీల్లోనూ నేను లేను. ఇదే సత్యం. జమ్మూ కాశ్మీర్ విషయంలో చేసిన దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోడీని నేను ఎందుకు అడగాలి? అది తెలివి తక్కువతనం అవుతుంది. అది సరైనది కాదు’ అని అబ్దుల్లా పేర్కొన్నారు.