9 రోజులుగా వైద్యం అందక కార్మికుల అవస్థలు

9 రోజులుగా వైద్యం అందక కార్మికుల అవస్థలు
  • జీతాలు రాక విధులు బహిష్కరించిన సిబ్బంది 
  • 9 రోజులుగా వైద్యం అందక కార్మికుల అవస్థలు 
  •  మందుల కోసం బీపీ, షుగర్​ పేషెంట్ల తిప్పలు  
  • అత్యవసర సమయాల్లో ప్రైవేట్​ హాస్పిటళ్లకు.. 
  • ఉన్నతాధికారుల తీరుపై కార్మికుల ఆగ్రహం 

మంచిర్యాల,వెలుగు: ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల మంచిర్యాలలోని డిస్పెన్సరీ మూతపడ్డది. డాక్టర్​తో పాటు స్టాఫ్​కు మూడు నెలలుగా జీతాలు ఆపేయడంతో ఈ నెల 18 నుంచి విధులు బహిష్కరించారు. దీంతో తొమ్మిది రోజులుగా డిస్పెన్సరీ తెరుచుకోవడం లేదు. కార్మికులు, వారి కుటుంబసభ్యులు వైద్య సేవలు అందక అవస్థలు పడుతున్నారు. రోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు డిస్పెన్సరీ మూసి ఉండడం చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. ఈ నెల మందులు సైతం పంపిణీ చేయకపోవడంతో బీపీ, షుగర్ పేషెంట్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసర సమయాల్లో హయ్యర్​ సెంటర్లకు రెఫర్​ చేసే వాళ్లు లేక ప్రైవేట్​ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు.  

పేషెంట్లకు తప్పని తిప్పలు... 

మంచిర్యాల, ఆసిఫాబాద్​ డిపోల్లోని కార్మికులు, రిటైర్డ్​ కార్మికులు, వారి కుటుంబసభ్యులకు వైద్యసేవలు అందించేందుకు మంచిర్యాలలో డిస్పెన్సరీని ఏర్పాటు చేశారు. మంచిర్యాల డిపోలో 551 మంది, ఆసిఫాబాద్​ డిపోలో 325 మంది కార్మికులు ఉన్నారు. వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డిస్పెన్సరీలో చూపించుకోవాల్సిందే. ఆపరేషన్లు, ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ అవసరమైతే​ ఇక్కడినుంచే హైదరాబాద్​ తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్​కు రెఫర్​ చేస్తారు. బీపీ, షుగర్​, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న డిస్పెన్సరీలోనే నెలనెలా మందులు పంపిణీ చేస్తారు. ప్రతి నెల సుమారు 1500 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. తొమ్మిది రోజులుగా డాక్టర్​, సిబ్బంది డ్యూటీకి రాకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్లు రోజూ డిస్పెన్సరీకి వచ్చి నిరాశతో వెళ్లిపోతున్నారు. అత్యవసర సమయాల్లో ప్రైవేట్​ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. బీపీ, షుగర్​ మందులు ప్రైవేట్​ మెడికల్స్​లో కొనుక్కుంటున్నారు.  

ఉన్నతాధికారుల తీరుతోనే....  

ఆర్టీసీ డిస్పెన్సరీలో ప్రస్తుతం కాంట్రాక్ట్​ డాక్టర్​తో పాటు స్టాఫ్​నర్స్​, వార్డ్​బాయ్​ ఔట్​సోర్సింగ్​లో పని చేస్తున్నారు. కీలకమైన ఫార్మసిస్ట్​, ల్యాబ్​ టెక్నీషియన్, రికార్డ్​ అసిస్టెంట్​ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ​మందుల పంపిణీకి సంబంధించి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉండగా, మూడేండ్ల నుంచి జరగడం లేదు. 2018 నుంచి ఆన్​లైన్ సైతం పనిచేయడం లేదు. ఇటీవల వచ్చిన ఆదిలాబాద్​ రీజినల్​ మేనేజర్​ ఆడిటింగ్ పూర్తి చేసి, ఆన్​లైన్​ స్టార్ట్​ చేయాలంటూ మూడు నెలలుగా జీతాలు ఆపినట్లు సిబ్బంది తెలిపారు. ఆడిటింగ్​, ఆన్​లైన్​తో తమకు సంబంధం లేకపోయినా వేతనాలు నిలిపేయడంతో డాక్టర్​, సిబ్బంది ఈ నెల 18 నుంచి విధులకు దూరంగా ఉన్నారు. ఆన్​లైన్​ చేసేంత వరకు మందులు సైతం ఇవ్వొద్దని ఆదేశించడం వల్ల ఈ నెల 8న మందులు వచ్చినప్పటికీ పేషెంట్లకు పంపిణీ చేయలేదు. 

వైద్యం అంతంతమాత్రమే...  

మంచిర్యాలలోని డిస్పెన్సరీలో సిబ్బంది, మందుల కొరతతో వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. కీలకమైన ఫార్మసిస్ట్​, ల్యాబ్​ టెక్నీషియన్​, రికార్డ్​ అసిస్టెంట్​ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. డిస్పెన్సరీలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ జబ్బులతో పాటు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు మాత్రమే ట్రీట్​మెంట్​, మందులు అందిస్తున్నారు. కార్మికులకు గాయాలైనా, ఇతర వ్యాధుల బారినపడ్డా మందులు బయట కొనుక్కోవాల్సిందే. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం, మెషీన్లు చెడిపోవడం వల్ల రక్త, మూత్ర పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్​లే దిక్కవుతున్నాయి. యూపీఎస్ కూడా లేకపోవడంతో కరెంట్ పోతే అంధకారం అలుముకుంటోంది. 

జీతాలిస్తేనే డ్యూటీ చేస్తాం... 

నేను 2018 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నాను. డిస్పెన్సరీలో కీలకమైన ఫార్మసిస్టు పోస్టు నాలుగేండ్ల నుంచి ఖాళీగా ఉంది. గతంలో ఓడీ (అవుటాఫ్ డ్యూటీ)పై నియమించిన ఫార్మసిస్ట్​ను తొలగించారు. ఆడిటింగ్, ఆన్​లైన్​తో మాకు సంబంధం లేకున్నా మూడు నెలలుగా జీతాలు ఆపారు. దీంతో ఈ నెల 18 నుంచి విధులు బహిష్కరించాం. జీతాలు చెల్లించేంత వరకు డ్యూటీ చేసేదిలేదు.  

రెండు రోజుల్లో పరిష్కరించాలి 

డిస్పెన్సరీ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ఎంప్లాయీస్​ యూనియన్​ ఉమ్మడి జిల్లా సెక్రటరీ వీ.భీమేశ్వర్​రావు డిమాండ్​ చేశారు. డిస్పెన్సరీ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం డిపో మేనేజర్​కు మెమోరాండం అందించారు. లేకుంటే కార్మికులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తొమ్మిది రోజులుగా డిస్పెన్సరీలో వైద్యం అందక కార్మికులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్ వంటి సమస్యలకు టెస్టులు చేసి నిర్ధారించే సౌకర్యం ఇక్కడ లేదన్నారు. పేషెంట్లను తార్నాక హాస్పిటల్​కు పంపడం వల్ల మూడు నాలుగు రోజులు డ్యూటీలు పోతున్నాయని అన్నారు.  ఈ సమస్యలున్న వారిని ముందుగా లోకల్ హాస్పటళ్లకు రెఫర్ చేయాలని, వ్యాధి నిర్ధారణ తర్వాత తార్నాకకు పంపాలని సూచించారు. డిస్పెన్సరీలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు అన్ని రకాల మందులను సప్లై చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.