అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు

అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు
  • ఫ్యాక్టరీల్లో నో సేఫ్టీ
  • అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు 
  • సేఫ్టీ ప్రికాషన్స్​ తీసుకోని ఫ్యాక్టరీ మేనేజ్‌‌మెంట్లు
  • ఇండస్ట్రీయల్​ ఏరియాలో  కనిపించని ఫైర్ స్టేషన్స్ 
  • ఫ్యాక్టరీలు ​ఒకచోట.. ఆఫీసర్లు మరోచోట
  • కనిపించని తనిఖీలు.. ఫైర్ ​సేఫ్టీ 


సంగారెడ్డి/ జిన్నారం, వెలుగు:  అగ్ని ప్రమాదాలతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో తరచూ రియాక్టర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్స్ వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కార్మికులు ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడినవారు గాయాలపాలవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీల్లో మేనేజ్‌‌మెంట్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీసర్ల పర్యవేక్షణ లేదన్న విమర్శలు ఉన్నాయి. 

రెగ్యులర్‌‌‌‌గా ప్రమాదాలు

గ్యాస్, బయో ఫ్యుయల్​ ఆధారిత ఫ్యాక్టరీల్లో గ్యాస్ చాంబర్, రియాక్టర్లు, కెమికల్​వేస్టేజ్, విషవాయువులు నిండి రియాక్టర్లు పేలడం, గ్యాస్ లీక్ అవడం, షాక్ సర్క్యూట్స్ వంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో పని చేయించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్​స్కిల్డ్ లేబర్‌‌‌‌తో పని చేయించుకుంటున్నారు. దీంతో వీరికి సరైన అవగాహన లేక అత్యవసర టైంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. 

ఫైర్ స్టేషన్లు లేకపోవడంతో...

ఫ్యాక్టరీలు ఉన్నచోట ఫైర్ స్టేషన్లు లేకపోవడం ప్రమాదాల తీవ్రతను రెట్టింపు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా భారీ, మధ్య తరహా చిన్న పరిశ్రమలు దాదాపు 4,500 వరకు ఉన్నాయి. వాటిల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిన శాఖల ఆఫీసులు మాత్రం హైదరాబాద్‌‌లో ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే  ఆఫీసర్లు  ఇక్కడికి వచ్చి వెళ్తుంటారే తప్ప మామూలు టైంలో తనిఖీలు చేయరనే విమర్శలు ఉన్నాయి. ఐడీఏ బొల్లారం, గుమ్మడిదల ఇండస్ట్రియల్​ ఏరియాలో ఫైర్ స్టేషన్లు లేవు. గుమ్మడిదలలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట జహీరాబాద్ పటాన్ చెరు, పాశమైలారం ప్రాంతాలలో ఫైర్ స్టేషన్లు ఉన్నా సరిపోను వాహనాల్లేవు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ పై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మరిన్ని ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

 ఫ్యాక్టరీల్లో ఇటీవల ప్రమాదాలు...

జనవరి 8న మైలాన్ పరిశ్రమలో రసాయన డ్రమ్ములు పేలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. . జనవరిలో పటాన్ చెరు పారిశ్రామికవాడలోని ఓ స్క్రాప్ గోదాంలో రసాయనాలు నిల్వ చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఫిబ్రవరి 8న జిన్నారం మండలం గడ్డపోతారంలోని లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా భారీ పేలుడు  సంభవించి షిఫ్ట్ ఆపరేటర్ కు గాయాలయ్యాయి.  కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. ఐడీఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని శ్రీకర ఆర్గానిక్స్ ఫార్మా ఫ్యాక్టరీలో మార్చి 2న బ్రాయిలర్ లో మెటీరియల్ వేస్తుండగా మంటలు అంటుకొని ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఇదిలా ఉంటే గతేడాది ఎండాకాలంలో గడ్డపోతారం ఇండస్ట్రియల్​ ఏరియాలోని వర్ధమాన్ కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హత్నూర మండలం గుండ్ల మాచనూర్ శివారులో గల అరబిందో యూనిట్ 9 ఫ్యాక్టరీలో పొగ, మంటలు ఎగిసిపడి కార్మికులు, గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఇలా ఏటా అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

ఫ్యాక్టరీలదే బాధ్యత

ఫ్యాక్టరీలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో యాజమాన్యాలదే పూర్తి బాధ్యత ఉంటుంది. ప్రొఫెషనల్ సిబ్బంది, నైపుణ్యం గల వారితో పని చేయించుకుంటే ప్రమాదాలు జరగవు. అగ్ని ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పరిశ్రమల యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం.

- ప్రవీణ్ కుమార్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్

పరిహారం ఊసే లేదు.. 

ప్రమాదాల్లో చనిపోతున్న వ్యక్తుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వర్క్​మెన్​ కంపెన్షన్​ యాక్ట్​  ప్రకారం.. ప్రమాదాల్లో చనిపోయినవారికి, తీవ్రంగా గాయపడినవారికి కంపెనీలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.  అయితే దీనిపై ఫ్యాక్టరీల ఓనర్స్ పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి.   డ్యూటీకి వచ్చే గంట ముందు డ్యూటీ అయిపోయాక మరో గంట వరకు కార్మికునికి ఏం జరిగినా ఆ బాధ్యత ఫ్యాక్టరీ ఓనర్స్ దేనని చట్టం చెబుతోంది.