వర్క్లో బ్రేక్​ తప్పనిసరి

వర్క్లో బ్రేక్​ తప్పనిసరి

బ్రేక్ అనేది లేకుండా అదే పనిగా పనిచేయడం అంత మంచిది కాదు. అలా చేయడం వల్ల ఒత్తిడి, అలసట, లేజీనెస్‌ పెరుగుతాయి. పని మీద ఏకాగ్రత పోతుంది.  మానసికంగా అనారోగ్యం పాలవుతారు’ అంటోంది సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌‌. సోనల్‌ ఆనంద్‌. ఒత్తిడిని ఎలా గుర్తించాలి? దాన్నుంచి ఎలా బయటపడాలో టిప్స్‌ కూడా చెప్పిందామె. ఒత్తిడి వల్ల అలసటగా అనిపిస్తుంది. దానివల్ల చిన్నపని చేయాలన్నా శక్తి లేనట్టు, అలసిపోయినట్టు ఉంటుంది. రోజూ చేసే పనే అయినా భారంగా అనిపిస్తుంది. నిద్రలేమి (ఇన్‌సోమ్నియా), నిద్ర పట్టినా త్వరగా మెలకువ రావడం లాంటివి ఒత్తిడి లక్షణాలే. హైపర్‌‌సోమ్నియాతో రోజంతా నిద్ర మత్తుగా అనిపించడం  ఒత్తిడి లక్షణమే. మానసిక అలసట వల్ల తెలియని దడ, భయాందోళన ఉంటాయి. దాంతో ఒంటరితనం, డిప్రెషన్‌కు వెళ్లే అవకాశం ఉంది. కోపం, ఫ్రస్ట్రేషన్‌ ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా అగ్రెసివ్‌గా రియాక్ట్‌ అవుతుంటారు. సిగరెట్‌, మద్యపానం తాగే వాళ్లలో ఈ లక్షణాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి.  బర్నవుట్‌ అనేది పైన చెప్పిన మెంటల్‌ స్ట్రెస్‌లన్నీ దాటితే వస్తుంది. దానివల్ల మానసికంగా కుంగిపోతూ, ‘ఎవ్వరూ నా వాళ్లు కాదు’ అనే ఫీలింగ్‌లో ఉంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్​కు దూరం అవుతుంటారు. 

టార్గెట్‌ పెట్టుకోవాలి

చేయాల్సిన టైంలో పని పూర్తి చేయకపోవడంవల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల బ్రేక్‌ టైంలో కూడా పని గురించి ఆలోచించి ఒత్తిడి బారిన పడతారు. అందుకే పని చేస్తున్నప్పుడు ‘బ్రేక్ టైం వరకు పని పూర్తిచేయాల’నే ఒక టార్గెట్‌ పెట్టుకోవాలి. దానివల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. ఫ్రీ టైం పెరుగుతుంది. ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్లాక, రేపు చేయాల్సిన పని గురించి ఆలోచించడం మానేయాలి. మెంటల్‌గా రిఫ్రెష్‌ అయ్యే పనులు చేయాలి. దానివల్ల ఒత్తిడిని కొంత వరకు తగ్గించొచ్చు.