ఇంజినీరింగ్ రీసెర్చ్​లకు వరల్డ్ బ్యాంకు నిధులు

ఇంజినీరింగ్ రీసెర్చ్​లకు వరల్డ్ బ్యాంకు నిధులు

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో క్వాలిటీతో పాటు రీసెర్చ్, ఇన్నోవేషన్లపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికిగానూ ప్రపంచబ్యాంకు సహకారంతో 15 రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను ఎంపిక చేయనున్నది. నేషనల్ ఎడ్యుకేషన్​ పాలసీలో భాగంగా దీన్ని అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్రం ఎంపిక చేసిన 15 రాష్ట్రాల్లో మన తెలంగాణ కూడా ఉంది. రాష్ట్రం నుంచి ఎన్ని సంస్థలు, ఎంతమంది విద్యార్థులను ఎంపిక చేస్తారనేది త్వరలోనే తేలనుంది.

టెకీప్  స్థానంలో మెరిట్.. 

దేశంలో ఇప్పటివరకు కొనసాగుతున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్(టెకీప్) ప్రాజెక్ట్ సీరిస్ 2021–22తో ముగిసింది. ఇది 3 సర్కిల్స్ (15 ఏండ్లు) కొనసాగింది. దీనిద్వారా తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల్లోని టెక్నికల్ ఎడ్యుకేషన్​లో క్వాలిటీ ఇంప్రూవ్ మెంట్ కు చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో టెకీప్ ద్వారా నిరుడు జేఎన్టీయూ పరిధిలోని 3 సర్కారు ఇంజినీరింగ్ కాలేజీలు, ఓయూ పరిధిలోని ఒక కాలేజీకి రూ.35కోట్ల ఫండ్స్ వచ్చాయి. దీనిద్వారా క్వాలిటీ పెంచేందుకు వర్సిటీలు చర్యలు తీసుకున్నాయి. తాజాగా టెకీప్ స్థానంలో కేంద్రం మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్​మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్(మెరిట్) పేరిట కొత్త ప్రోగ్రామ్ తెచ్చింది. దీన్ని 2022–23 నుంచి 2027–28 వరకు ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్​, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అస్సాం, గుజరాత్, ఉత్తరా​ఖండ్, యూపీ తదితర రాష్ట్రాలను ఎంపిక చేసింది. 

16 లక్షల మంది స్టూడెంట్లకు లబ్ధి

దక్షిణ భారతదేశంలో టెకీప్ ప్రాజెక్టులో ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలుండేవి. మెరిట్ ప్రోగ్రామ్​లో తెలంగాణతో పాటు కర్నాటకను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులకు కేంద్రం తెలియజేసింది. దీంతో రాష్ట్రంలోని 14 వర్సిటీల, మొత్తం పాలిటెక్నిక్ కాలేజీల డేటాను ఇక్కడి అధికారులు పంపించారు. త్వరలోనే దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వనుంది. ఈ ఐదేండ్ల ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది డిగ్రీ స్టూడెంట్లు, లక్ష మంది పీజీ స్టూడెంట్లు, 15వేల మంది ఫ్యాకల్టీకి లబ్ధి చేకూరనుంది.