Cricket World Cup 2023: నీ సరదా ఇక్కడితో ఆపేయ్.. అని కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు: జార్వో

Cricket World Cup 2023: నీ సరదా ఇక్కడితో ఆపేయ్.. అని కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు: జార్వో

జార్వో.. క్రికెట్ అభిమానులకు ఇతను మంచి పరిచయస్తుడే. క్రికెట్ అన్నా.. అందునా భారత జట్టన్నా అతనికి ఓ సరదా! ఆటగాడిలా భారత జెర్సీ ధరించి మ్యాచ్‌లకు హాజరయ్యే జార్వో.. సెక్యూరిటీ కళ్లుగప్పి ఉన్నట్టుండి మైదానంలోకి వచ్చేస్తుంటాడు. రెండ్రోజుల క్రితం చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్ లో జార్వో అలాంటి పనే చేశాడు. 

ఓవైపు ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిలా టీమిండియా జెర్సీ ధరించిసెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి వచ్చాడు. జెర్సీపై అతని పేరు కూడా ఉంది. వెంటనే మైదాన సిబ్బంది అతడిని బయటికి తీసుకెళ్లారు. జార్వో మైదానంలోకి వచ్చిన సమయంలో పలువురు భారత ఆటగాళ్లు కూడా అతనితో మాట్లాడారు. విరాట్ కోహ్లీ కూడా అతనితో ఏదో సంభాషించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన జార్వో..  విరాట్ కోహ్లీ తనకు వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడించాడు. 

"జార్వో, నువ్ చేసే సరదా వీడియోలు నేనెంతో ఇష్టపడతా. కానీ, ఇప్పుడు మాత్రం దీనిని ఆపేయ్‌.." అని మైదానంలో కోహ్లీ తనకు వార్నింగ్ ఇచ్చినట్లు జార్వో సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు.

జార్వోపై నిషేధం..!

కాగా, సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి చొరబడ్డ జార్వో చర్యలపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అతను హాజరు కాకుండా నిషేధం విధించింది. భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) ఆ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఐసీసీ వెల్లడించింది.