ప్రపంచ పెద్దమ్మ కన్నుమూత

ప్రపంచ పెద్దమ్మ కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించిన కానే ఠనాకా 119వ ఏట కన్నుమూశారు. నైరుతి జపాన్ లోని పుకోకా పట్టణానికి చెందిన ఆమె ఈనెల 19వ తేదీన తుదిశ్వాస విడిచారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. 2019 మార్చి నెలలో గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగ వయస్సున్న వ్యక్తిగా కానేను గుర్తించింది. అప్పటికి ఆమెకు 116 ఏళ్లు. అలాగే 2020 సెప్టెంబరులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా కానే రికార్డుల్లోకెక్కారు. అప్పటి ఆమె వయస్సు 117 సంవత్సరాల 261 రోజులు. 

ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం బతికిన రెండో వ్యక్తిగా కానే ఠనాకా రికార్డులకు ఎక్కారు. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన 1903వ సంవత్సరంలో జనవరి 2వ తేదీన కానే జన్మించారు. 1922లో 19వ ఏట హిడియో ఠనాకా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. మరొకరిని దత్తత తీసుకున్నారు. 1937లో రెండో చైనా, జపాన్ యుద్ధంలో పాల్గొనేందుకు భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో కానే నూడుల్స్ దుకాణం నడిపారు. సోడా, చాక్లెట్ సహా రుచికరమైన  ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తన సుదీర్ఘ ఆయువుకు కారణమని చెప్పేవారు. ఠనాకా మరణంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్సున్న వ్యక్తిగా ఫ్రాన్స్ మహిళ లుసిలీ రాండన్ నిలిచారు. ఆమె వయస్సు 118 సంవత్సరాల 73 రోజులు.

మరిన్ని వార్తల కోసం..

రష్యా తీరుతో యూరప్ కు ప్రమాదం

బిజినెస్​ చేద్దాం.. రెడీనా?