టన్నుల కొద్దీ మాటలు కాదు.. గోరంత చేతలు కావాలి: మోడీ

టన్నుల కొద్దీ మాటలు కాదు.. గోరంత చేతలు కావాలి: మోడీ

న్యూయార్క్: పర్యావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకునే విషయంలో ప్రపంచం చేయాల్సిన స్థాయిలో కృషి చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీరియస్ చాలెంజ్ లను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నప్పుడు మనలోని లోపాలను నిజాయితీగా ఒప్పుకోవాలని చెప్పారాయన. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరుగుతున్న యూన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో ఆయన తొలి ప్రసంగం చేశారు.

రోడ్ మ్యాప్ వేస్తాం

పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ మార్పు రావాల్సి ఉందన్నారు. టన్నుల కొద్దీ మాటలు చెప్పే కన్నా గోరంత పని చేసి ఆచరణలో చూపడం మేలని మేం నమ్ముతామని మోడీ చెప్పారు. ఈ దిశగా భారత్ కేవలం మాటలు చెప్పడానికి ఇక్కడ లేదని, ఈ సీరియస్ సమస్యను పరిష్కరించడానికి ఒక రోడ్ మ్యాప్ చూపడానికి ఈ సభలో అడుగుపెట్టామని అన్నారు. ఇప్పటికే భారత్ లో భారీగా పునరుత్పాదక ఇంధన వినియోగం పెంచామని చెప్పారు. తమ బాటలోనే సోలార్ పవర్ వాడకంలో 80 దేశాలు అనుసరిస్తున్నాయని అన్నారు.

అలాగే దేశంలో కోట్లాది ప్రజలకు క్లీన్ వంట గ్యాస్ అందజేశామన్నారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభించి.. నదుల శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనులు చేపడుతున్నామని వివరించారు.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విడిచి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చామన్నారు ప్రధాని మోడీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంలో అవగాహన పెరగాల్సి ఉందన్నారు. మాటలకు ఇక టైం లేదు, చేతల్లో చూపించాల్సన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.