జనం మెచ్చిన టీవీ..బ్లాక్ అండ్ వైట్ టూ స్మార్ట్

జనం మెచ్చిన టీవీ..బ్లాక్ అండ్ వైట్ టూ స్మార్ట్

టెలివిజన్,, జనానికి ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎక్కడెక్కడో జరిగే ఎన్నో వింతలు, విశేషాలను నిత్యం కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ తో ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు దాని మీదే ఆధారపడేలా చేసింది. న్యూస్, సినిమా, సీరియల్స్, క్రికెట్, రియాలిటీ షోలు ఇలా జానర్లతో సంబంధం లేకుండా కార్యక్రమాలతో జనాన్ని టీవీకి అతుక్కుపోయేలా చేసింది. 1996లో తొలిసారి ప్రపంచ టెలివిజన్ ఫోరం నవంబర్ 21న నిర్వహించారు. అప్పటి నుంచి ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

స్కాటిష్ ఇంజనీర్, జాన్ లోగీ బెర్డ్ 1926లో తొలి టెలివిజన్ ను రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత టెలివిజన్ ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు వేస్ట్ బాక్స్ గా పిలిచిన టీవీ ఆ తర్వాత బెస్ట్ బాక్సుగా మారింది. ప్రారంభంలో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న టెలివిజన్ ఆ తర్వాత కలర్లోకి మారింది. అది కాస్తా ఇప్పుడు స్మార్ట్ టీవీగా మారిపోయింది. ఇక ఇంటర్నెట్ వాడకం పెరిగాక చాలా మంది ప్రజలు స్మార్ట్ ఫోన్లలోనే టీవీ ప్రోగ్రాంలు చూస్తున్నారు. ఇండియాలో అయితే చాలా మంది టీవీకి బానిసలుగా మారిపోయారంటే అది ఏ మేరకు ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 

1948నాటికి 1 మిలియన్ మంది ఇళ్లలో టెలివిజన్లు ఉండేవట. 1941 జూలైలో బులోవా వాచ్ కోసం రూపొందించిన 20 సెకన్ల ప్రకటన టీవీలో ప్రసారమైన తొలి యాడ్. ఈ అడ్వర్టైజ్ మెంట్ న్యూయార్క్లో ప్రసారమైంది. ఇక భారత్ విషయానికొస్తే ఒకప్పుడు కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది. బ్లాక్ అండ్ వైట్లో ప్రసారం చేసే కార్యక్రమాలను ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూసేవారు. కాలం గడిచేకొద్దీ ప్రైవేట్ ఛానళ్లు రంగ ప్రవేశం చేయడంతో దూరదర్శన్ ప్రాధాన్యత పడిపోయింది. డిష్ టీవీ రాకతో ప్రేక్షకులకు అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. 

1985లో దేశంలో కేబుల్ టీవీ ప్రారంభమైంది. 1995లో ప్రాంతీయ భాష ఛానెళ్ల రాకతో అది మరింత విస్తరించింది. 2015 నాటికి భారత్లో టీవీ ఛానళ్ల సంఖ్య 400 దాటింది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రాంతీయ భాషకు అనుగుణంగా కొత్త కొత్త ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి. టీవీ ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయి పోటీ పెరగడంతో భిన్నమైన సమాచారం అందించడమే లక్ష్యంగా ఛానెళ్లు తమ కార్యక్రమాలు రూపొందించడం ప్రారంభించాయి. వార్తలు, సినిమాలు, పాటలు, క్రీడలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, బిజినెస్, హెల్త్, ఎడ్యుకేషన్, వంటలు ఇలా ప్రతి జానర్ లో ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి. 

నవంబర్ 21న ఐక్యరాజ్య సమితి టెలివిజన్ డేగా ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత ప్రభావాత్మకంగా జనాలకు సామాజిక, రాజకీయ, అంశాలతో పాటు ఇతర సమాచారాలను క్షణాల్లో చేరవేసే శక్తివంతమైన సాధనంగా టెలివిజన్ను గుర్తించడమే అందుకు కారణం. నిత్యం కొన్ని కోట్ల మంది టీవి చూడటం దినచర్యగా మారిపోయింది. రోజూ వారికిష్టమైన సీరియల్స్, ప్రోగ్రామ్స్, వార్తలు చూసేందుకు టీవీల ముందు గంటల కొద్దీ గడుపుతున్నారు.