మహిళా దినోత్సవం కోరిక ఆమెదే

మహిళా దినోత్సవం కోరిక ఆమెదే

మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటోంది. మార్చి 1 నుంచే ఈ సంబురాలు మొదలవుతాయి. హక్కులపై అవగాహన కల్పిస్తూ జరుపుకునే ఈ సంబురం వెనుక ఓ స్త్రీమూర్తి పోరాటం ఉంది. ఓ కార్మిక ఉద్యమం ఉంది. మహిళలకు అన్నిరంగాల్లో సమానత కల్పించాలనే ఓ గొప్ప ఆలోచన ఉంది. 1908లో మహిళా దినోత్సవానికి బీజం పడింది. తక్కువ పని గంటలు. మెరుగైన జీతం. ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ఉద్యమం చేశారు. ఒకేసారి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించారు. ఈ ఉద్యమ డిమాండ్లను దృష్టిలో పెట్టుకునే అమెరికా సోషలిస్ట్ పార్టీ 1909లో ‘జాతీయ మహిళా దినోత్సవాన్ని’  ప్రకటించింది. కానీ, ‘ఆ దేశంతోనే ఈ ఉద్యమం ఆగకూడదు. ప్రతిదేశ మహిళ తన హక్కుల గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే దానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉండాలి’ అని ఆ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ‘క్లారా జెట్కిన్’ అనే ఓ మహిళ ఆలోచించింది. దానికి ప్రతిఫలమే కోపెన్ హెగెన్‌‌‌‌ సిటీలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సు’లో ‘ఇంటర్నేషనల్ ఉమెన్ డే’ కోసం ప్రతిపాదన పెట్టడం. ఆ సదస్సుకు 17 దేశాలకు చెందిన వంద మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా క్లారా జెట్కిన్‌‌‌‌ ప్రతిపాదనను  ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆ తర్వాత 1911లో తొలిసారిగా ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌‌‌‌ దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరిపారు. 1917 యుద్ధం టైంలో రష్యా మహిళలు ‘ఆహారం…శాంతి’ అనే పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ తరువాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలజ్ జా-2 తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కు కల్పించింది. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మార్చి 8. అందుకే మార్చి 8న ఉమెన్స్ డే జరుపుకోవడం మొదలైంది. అయితే 1975 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ సంబురాన్ని అధికారికంగా జరపడం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్‌‌‌‌తో ఈ దినోత్సవాన్ని జరుపుతోంది. మొట్టమొదటి సారి ‘గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం’ థీమ్‌‌‌‌తో ఉమెన్స్ డే జరిపింది. అప్పటినుంచి ఇప్పటివరకూ మహిళలకు స్ఫూర్తి కలిగించే థీమ్స్‌‌‌‌తో ఈ ఉమెన్స్‌‌‌‌ డే ను సెలబ్రేట్ చేస్తుంది. అలా రాను రాను సామా జికంగానూ, రాజకీయాల్లోనూ, ఆర్డికం గానూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.

ఇవి కూడా చదవండి

టెట్​ లేకుండానే టీచర్స్ రిక్రూట్​మెంట్​కు సర్కార్ ఆలోచన

మన్యంలో శిలాయుగం గుర్తులు

లాభాల్లో ఉన్నా ప్రైవేటైజేషన్.. ఎవరి కోసం?

రోజుకో యాపిల్ తినడం మంచిదేనా?