దుబాయ్: కారు నంబర్ ప్లేట్ కోసం ఒక వ్యాపారవేత్త రూ.10 కోట్లు కాదు.. రూ.20 కోట్లు కాదు.. ఏకంగా రూ.123 కోట్లు ఖర్చు చేశాడు.. ఈ భారీ డీల్ ద్వారా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలియరాలేదు. కానీ ఇంత ధర పలికిన ఆ అట్రాక్టివ్ కారు నంబర్ ఏమిటో మాత్రం తెలిసింది. అదే.. ‘పీ7’!! దీనికోసం దుబాయ్‌లోని జుమేరాలో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్‌లో రూ.33 కోట్ల వద్ద మొదలైన వేలంపాట కొన్ని సెకన్లలోనే రూ.66 కోట్లకు చేరింది. చివరకు ధర అంతకంతకూ పెరుగుతూ రూ.123 కోట్ల దగ్గర క్లోజ్అయింది.
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన ‘ఎమిరేట్స్ ఆక్షన్’ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. తొలుత ఈ వేలంపాటలో టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, యజమాని , ఫ్రెంచ్–ఎమిరాటీ బిజినెస్మన్పావెల్ వాలేరైఎవిచ్దురోవ్ కూడా పాల్గొన్నారు. ఆయన కారు నంబర్ప్లేట్కోసం రూ.55 కోట్లకు బిడ్‌ను దాఖలు చేశారు. ఆ తర్వాత ఒక దశలో బిడ్డింగ్ కొంతసేపు ఆగిపోయింది. అనంతరం చాలామంది అంతకంటే ఎక్కువ ధరను కోట్ చేస్తూ బిడ్స్ సమర్పించారు. దీంతో కారు నంబర్ ప్లేట్ ధర ఏకంగా రూ.123 కోట్లకు ఎగబాకింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ధరను పలికిన కారు నంబర్ ప్లేట్‌గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది.
రంజాన్ వేళ ‘వన్బిలియన్ మీల్స్’ లక్ష్యంతో..
రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది పేదలకు ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ ‘వన్ బిలియన్ మీల్స్' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీనికి ‘ఎమిరేట్స్ ఆక్షన్’ సంస్థ మద్దతుగా నిలిచింది. దీని ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న నిర్వహించిన వేలంపాటలో అనేక ఇతర వీఐపీ నంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్లను వేలం వేశారు. వేలం ద్వారా మొత్తం రూ.223 కోట్లు కలెక్ట్ చేశారు. ఇందులో కార్ ప్లేట్లు, ప్రత్యేకమైన మొబైల్ నంబర్ల వేలం ద్వారా రూ.218 కోట్లు వచ్చాయి. రంజాన్ సందర్భంగా పేదలకు ఉచిత ఆహారం ఇచ్చేందుకు ఈ డబ్బును ఉపయోగించనున్నారు. కాగా, 2008 సంవత్సరంలో అబుధాబీలో ‘నంబర్1’ కారు నంబర్ ప్లేట్ కోసం వేలంపాట హోరాహోరీగా జరిగింది. దాన్ని అప్పట్లో లోకల్ బిజినెస్‌మన్ సయీద్ అబ్దుల్ గఫూర్ ఖౌరీ కొనేశారు. ఇందుకోసం ఆయన రూ.116 కోట్లు చెల్లించారు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ రికార్డు బద్దలయింది.
