
ఐస్‌క్రీమ్‌కి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. రంగురంగుల్లో రకరకాల ఫ్లేవర్లతో అట్రాక్ట్ చేస్తుంది ఐస్‌క్రీమ్. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడతారు కూడా. అయితే, ఇక్కడ కనిపిస్తున్న ఐస్‌క్రీమ్ తినాలంటే మాత్రం పర్సులు, జేబులే కాదు... ఏకంగా బ్యాంక్ అకౌంట్లే ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే...
జపాన్‌కి చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ సెలాటో. ఆ కంపెనీ వాళ్లు అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో దీన్ని తయారుచేశారు. దీని తయారీ కోసం వైట్ ట్రపుల్ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించింది. ఈ ట్రపుల్ ధర 2 మిలియన్ యెన్లు ఉంటుందట. ఆల్బాలో మాత్రమే దొరికే ఈ ట్రపుల్ సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్లే ఐస్‌క్రీమ్‌కు అంత రేటు. అంతేకాదు.. దీనిలో తినే బంగారు రేకులు, నేచురల్ చీజ్‌లు ఉన్నాయి. ఇంతకీ దీని ధర ఎంత అంటారా... అక్షరాలా 8, 73, 400 జపనీస్ యెన్లు. అంటే... మన కరెన్సీలో దాదాపు 5.2 లక్షల రూపాయలన్నమాట! ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ ఐస్‌క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా గిన్నిస్ రికార్డ్ సాధించింది.