రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌, దీపక్‌, సాక్షికి స్వర్ణాలు

రెజ్లింగ్‌లో బజ్‌రంగ్‌, దీపక్‌, సాక్షికి స్వర్ణాలు

బర్మింగ్‌‌‌‌హామ్‌‌ : గత చరిత్రను కొనసాగిస్తూ.. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్లు ‘బంగారు’ పంట పండించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి అదరహో అనిపించారు. స్టార్‌‌ రెజ్లర్‌‌, డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ బజ్‌‌రంగ్‌‌ పూనియా (65 కేజీ), దీపక్‌‌ పూనియా (86 కేజీ), సాక్షి మాలిక్‌‌ (62 కేజీ) పసిడి కాంతులు పూయించగా, ‘బర్త్‌‌ డే గర్ల్‌‌’ అన్షు మాలిక్‌‌ సిల్వర్‌‌తో మెరిసింది. బరిలోకి దిగిన ప్రతి బౌట్‌‌లోనూ తమదైన మార్క్‌‌ ఉడుంపట్టుతో ఇండియన్‌‌ రెజ్లర్లు సూపర్‌‌ షో చేశారు. ముఖ్యంగా మెన్స్‌‌ 65 కేజీ టైటిల్‌‌ ఫైట్‌‌లో బజ్‌‌రంగ్‌‌ 9–2తో లాల్‌‌చ్లాన్‌‌ మౌరీస్‌‌ మెక్‌‌నిల్‌‌ (కెనడా)ను ఏకపక్షంగా ఓడించాడు. ఓవర్‌‌ డిఫెన్సివ్‌‌ టెక్నిక్‌‌తో గత ఏడాది కాలంగా ఫామ్‌‌ కోల్పోయిన బజ్‌‌రంగ్‌‌.. గేమ్స్‌‌లో మాత్రం ఓ పట్టు పట్టాడు. ఫైనల్లో ఆరంభం నుంచే అటాకింగ్‌‌ గేమ్‌‌తో సూపర్‌‌ టెక్నిక్‌‌ చూపెట్టాడు. ఫలితంగా తొలి పిరియడ్‌‌లోనే 4 పాయింట్లు సాధించి లీడ్‌‌లో నిలిచాడు. దానిని కొనసాగిస్తూ  రెండో పిరియడ్‌‌లో ఏకంగా 5 పాయింట్లు నెగ్గాడు.

అంతకుముందు జరిగిన బౌట్లలో ‘బై ఫాల్‌‌’ విక్టరీతో బజ్‌‌రంగ్‌‌ టైటిల్‌‌ ఫైట్‌‌కు దూసుకొచ్చాడు. తొలి రౌండ్‌‌లో బజ్‌‌రంగ్‌‌ 4–0తో లోవీ బింగ్‌‌హమ్‌‌ (నౌరుస్‌‌)పై, క్వార్టర్‌‌ఫైనల్లో 6–0తో జీన్‌‌ గులియాన్‌‌ జోరిస్‌‌ బండు (మారిషస్‌‌)పై, సెమీస్‌‌లో 10–0తో జార్జ్‌‌ రామ్‌‌ (ఇంగ్లండ్‌‌)పై గెలిచాడు. ఓవరాల్‌‌గా గేమ్స్‌‌లో బజ్‌‌రంగ్‌‌కు ఇది వరుసగా మూడో మెడల్‌‌ కావడం విశేషం. మెన్స్‌‌ 86 కేజీ ఫైనల్లో దీపక్‌‌ పూనియా 3–0తో మహ్మద్‌‌ ఇనామ్‌‌ (పాకిస్తాన్‌‌)ను ఓడించి దేశాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. అద్భుతమైన లెగ్‌‌ టెక్నిక్‌‌తో దీపక్‌‌ వరుసగా 2, ఒక పాయింట్‌‌ సాధించాడు. దీపక్‌‌ డిఫెన్స్‌‌ను విడిపించుకోలేకపోయిన పాక్‌‌ రెజ్లర్‌‌ ఒక్క పాయింట్‌‌ కూడా నెగ్గలేదు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌‌లో దీపక్‌‌ 10–0తో మాథ్యూ ఓక్సెన్‌‌హమ్‌‌ (న్యూజిలాండ్‌‌)పై, క్వార్టర్స్‌‌లో 10–0తో షేకూ కసెగమా (సియారా లియోన్‌‌)పై, సెమీస్‌‌లో 3–1తో అలెగ్జాండర్‌‌ మోర్‌‌ (కెనడా)పై గెలిచాడు. 

మూడోసారి.. 

టోక్యో ఒలింపిక్స్‌‌లో నిరాశపర్చిన సాక్షి మాలిక్‌‌.. గేమ్స్‌‌లో మాత్రం సూపర్‌‌ షో చూపెట్టింది. తన గత ఫామ్‌‌ను కొనసాగిస్తూ గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిసింది. విమెన్స్‌‌ 62 కేజీల ఫైనల్లో సాక్షి మాలిక్‌‌ ‘విక్టరీ బై ఫాల్‌‌’తో అన్నా గోడినెజ్‌‌ గొంజాలెజ్‌‌ (కెనడా)పై గెలిచింది. రియోలో గోల్డ్‌‌ గెలిచిన తర్వాత సాక్షి అనూహ్యంగా ఆటలో వెనకబడింది. కానీ తర్వాత ట్రెయినింగ్‌‌లో రాటుదేలి క్రమంగా మళ్లీ గాడిలో పడింది.  విమెన్స్‌‌ 68 కేజీల బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌లో దివ్యా కక్రాన్‌‌ 2–0తో టైగర్‌‌ లిల్లీ కాకర్‌‌ (టోంగా)పై గెలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మెన్స్​ 125 కేజీల్లో మోహిత్​ గ్రేవాల్​  6–0తో ఆరోన్​ జాన్సన్​ (జమైకా)ను ఓడించి బ్రాంజ్​ మెడల్​ సాధించాడు. 

అన్షు అదుర్స్‌‌

విమెన్స్‌‌ 57 కేజీ ఫైనల్లో అన్షు మాలిక్‌‌ 3–7తో ఒడునాయో ఫోల్సాడే అడెకురో (నైజీరియా) చేతిలో ఓడి రెండో స్థానంతో సిల్వర్‌‌ను సాధించింది. శుక్రవారంతో 21వ పడిలోకి ప్రవేశించిన అన్షుకు ఇదే మొదటి గేమ్స్‌‌ కావడం విశేషం. ఆరంభంలో బౌట్లలో టెక్నికల్‌‌ సుపీరియారిటీతో ఆకట్టుకున్న ఇండియన్‌‌ రెజ్లర్‌‌.. టైటిల్‌‌ ఫైట్‌‌లో మాత్రం ఆ ఫీట్‌‌ను రిపీట్‌‌ చేయలేకపోయింది. నైజీరియన్‌‌ రెజ్లర్‌‌ డిఫెన్స్‌‌లో స్ట్రాంగ్‌‌గా ఉండటంతో అన్షు కాస్త వెనుకబడింది. అంతకుముందు జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో అన్షు 10–0తో ఐరీనా సైమెండిస్‌‌ (ఆస్ట్రేలియా)పై, సెమీస్‌‌లో 10–0తో నెత్మి పోరుతాగే (శ్రీలంక)పై గెలిచింది.