రహానే సెంచరీ చేస్తే భారత్‌దే విజయం.. ప్రూఫ్ ఇదిగో..!

రహానే సెంచరీ చేస్తే భారత్‌దే విజయం.. ప్రూఫ్ ఇదిగో..!

'ఒక ఆటగాడు సెంచరీ చేస్తే మ్యాచ్ గెలవడం ఏంటి?' జ్యోతిష్యం చెప్తున్నారా అనుకోకండి. భారత వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే గణాంకాలే అందుకు సాక్ష్యాలు. ఇప్పటివరకూ 82 టెస్టులు ఆడిన రహానే 12 సెంచరీలు చేయగా.. అతడ సెంచరీ చేసిన ఏ మ్యాచులోనూ టీమిండియా ఓడిపోలేదు. 12 టెస్టుల్లో తొమ్మిందింటిలో గెలవగా, మరో మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఈ సెంటిమెంటే భారత అభిమానులను ఆనందాన్నిస్తోంది.

విదేశాల్లో మంచి రికార్డ్

రహానే టెస్టుల్లో స్వదేశంలో కంటే విదేశాల్లోనే మెరుగ్గా రాణించాడు. సొంత గడ్డపై 32 టెస్టులు ఆడిన రహానే 35.74 యావరేజ్‌తో 1644 పరుగులు చేయగా.. విదేశాల్లో 50 టెస్టుల్లో 40కిపైగా యావరేజ్‌తో 3287 పరుగులు చేశాడు. 2021లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై ఘోరంగా ఓడిన భారత్‌ను.. తర్వాతి టెస్టుల్లో రహానే ముందుండి నడిపించాడు. 2-1 తేడాతో భారత జట్టు ఆ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అతని ఫామ్‌ని ప్రశ్నిస్తోంది.

రహానే చివరిసారిగా గతేడాది(2022) జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో కనిపించాడు. ఆ తరువాత వరుసగా విఫలమవ్వడంతో అతనిపై సెలెక్టర్లు వేటు వేశారు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-16లో రహానే అద్భుతంగా రాణించాడు. క్లాసిక్ షాట్లతో అలరించాడు. అదే అతనిని టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌‌కు ఎంపికచేసింది. అతడు తన ఐపీఎల్‌ ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కొనసాగిస్తే జట్టుకు కలిసొచ్చేదే. ఏదేమైనా రహానే సెంచరీ చేయాలని, భారత్ విజేతగా నిలవాలని మనమూ కోరుకుందాం..