స్వింగ్ వికెట్లపై సిరాజ్‌‌ను ఆడించాలె

స్వింగ్ వికెట్లపై సిరాజ్‌‌ను ఆడించాలె

ముంబై: న్యూజిలాండ్‌తో జరగబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఎలాగైనా కివీస్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా ప్లేయర్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత ఫైనల్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉంటారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఇంగ్లండ్ పిచ్‌లు స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే తుది జట్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తీసుకోవాలని సూచించాడు. 

‘డబ్ల్యూటీసీ మ్యాచ్‌ చాలా ప్రత్యేకం. దీన్నో సాధారణ మ్యాచ్‌గా చూడకూడదు. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు, వాతావరణం ఎలా ఉంటుందనేది చాలా కీలకం. వాతావరణం పొడిగా ఉంటే టీమిండియా మహ్మద్ సిరాజ్‌ను బరిలోకి దించాలి. ఆస్ట్రేలియాలో అతడు ఆడిన సిరీస్ చివరి మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడాన్ని మరవొద్దు. ఒకవేళ పిచ్ మీద పచ్చిక ఉంటే ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దించాలి. బౌలింగ్ కాంబినేషన్ వైవిధ్యంగా ఉండాలనుకుంటే స్పిన్ అటాక్‌తో రెడీగా ఉండాలి. స్పిన్ పరంగా చూసుకుంటే న్యూజిలాండ్ కంటే భారత్ చాలా బలంగా ఉంది’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.