యాదాద్రి, వెలుగు: ధాన్యాన్ని అన్‌లోడ్ చేయకుండా జాప్యం చేస్తున్న మిల్లులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వడ్లను వెంటనే దించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని 41 రైస్ మిల్లులకు కేటాయించినప్పటికీ, కొందరు మిల్లర్లు అన్‌లోడ్ చేసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. కేటాయించిన ధాన్యంలో 80 శాతం కంటే తక్కువ అన్‌లోడ్ చేసిన 16 రైస్ మిల్లులకు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగానే సీఎంఆర్ కేటాయింపులు చేసినప్పటికీ ధాన్యాన్ని ఎందుకు దించుకోవడం లేదని నోటీసుల్లో ప్రశ్నించారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎంఆర్ నిలిపివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
