వైభవంగా యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

వైభవంగా యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి మార్చి 3 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రధాన ఆలయంలో స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. 22న ధ్వజారోహణం, 27న ఎదుర్కోలు, 28న తిరుకళ్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు రద్దు చేశారు. ఈనెల 28న నిర్వహించే స్వామివారి తిరు కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. 

అలాగే... గవర్నర్ తమిళి సై కూడా కళ్యాణంలో పాల్గొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక  టీటీడీ పోచంపల్లి చేనేత సంఘం తరపున కూడా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మరోవైపు... యాదాద్రి ఆలయ పునర్శిర్మాణం తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు ఏర్పాట్లు భారీగా చేశారు. గుట్టుకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధానాలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.