- నెల గడిచినా చర్యలు శూన్యం
- హాస్పిటల్స్‌లో అడ్డగోలుగా సిజేరియన్లు
- ఒకరిద్దరే నార్మల్..అందరికీ సిజేరియనే
- ప్రైవేట్‌కు ధీటుగా సర్కారు హాస్పిటల్స్
- ప్రైవేట్ లో 83.85 శాతం సిజేరియన్స్
- సర్కారు హాస్పిటల్స్‌లో 55 శాతం
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో సిజేరియన్ల సంఖ్య పెరిగిపోయిందని హడావుడిగా ప్రైవేట్హాస్పిటల్స్ను అధికారులు తనిఖీ చేశారు. వచ్చినవారిలో ఒకరిద్దరు నార్మల్ డెలివరీ అయితే, మిగిలిన గర్భిణులకు సిజేరియన్చేస్తున్న కొన్నింటిని గుర్తించి నోటీసులు అందజేశారు. నోటీసులు అందించి.. నెల గడుస్తున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ప్రైవేట్‌లో 83. 85 శాతం..
ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వచ్చిన గర్భిణులను కొందరు డాకర్లు ఏటీఎంగా భావిస్తున్నట్టు కన్పిస్తోంది. డెలివరీకి వచ్చిన వారిలో 84 శాతం మందికి సిజేరియన్‌చేసి బిడ్డలను బయటకు తీస్తున్నారని హెల్త్డిపార్ట్మెంట్లెక్కలు చెబుతున్నాయి. పేషెంట్‌వస్తే చాలు రకరకాల టెస్టులు చేయడం, డెలివరీ సమయానికి వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. నార్మల్కోసం ప్రయత్నం చేస్తం కానీ.. లేటయితే తల్లీబిడ్డకు ఏమైనాప్రమాదం జరిగితే మాకు సంబంధం లేదంటూ భయపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గర్భిణులు ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు.
ఒక్కో ఆపరేషన్‌కు ఆస్పత్రి స్థాయిని బట్టి.. రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటున్నారు. కొందరు డాక్టర్ల పైసల కక్కుర్తి కారణంగా సిజేరియన్చేయించుకున్న మహిళలు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 675 మంది డెలివరీ కాగా, ఇందులో 566 (83.85 శాతం) మందికి సిజేరియన్చేశారు. కేవలం 109 మంది మాత్రమే నార్మల్ డెలివరీ అయ్యారు.
ఒక్కరే నార్మల్..
గడిచిన ఆరు నెలల్లో జిల్లాలోని పలు మండలాల్లో ఒక్కరిద్దరు గర్భిణులు మాత్రమే నార్మల్ డెలివరీ కాగా, మిగిలిన వారందరికీ సిజేరియన్‌చేసి బిడ్డలను బయటకు తీశారు. రాజాపేట మండలంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు 39 మంది గర్భిణులు వస్తే వారిలో ఒక్కరు మాత్రమే నార్మల్డెలివరీ అయ్యారు. మిగిలిన 38 మందికి సిజేరియన్చేశారు. తుర్కపల్లి మండలంలో 48 మంది గర్భిణులు అక్కడి హాస్పిటల్స్‌కు వస్తే వీరిలో 46 మందికి సిజేరియన్చేయడం గమనార్హం.
ప్రభుత్వాస్పత్రుల్లోనూ..
ప్రభుత్వాస్పత్రుల్లో గతంతో పోలిస్టే సిజేరియన్ల సంఖ్య పెరిగింది. ప్రైవేట్‌కు ధీటుగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ప్రతి వంద మందిలో 55 మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. నార్మల్డెలివరీ చేయాలంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. డాక్టర్లు స్థానికంగా ఉండరు కాబట్టి.. వెయిట్చేయడమెందుకని ఆపరేషన్చేస్తున్న సంఘటనలు ఉన్నాయి.
కొందరు గర్భిణులు నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. మరికొందరైతే ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 31 వరకు 1268 మంది డెలివరీ అయితే, ఇందులో 700 మందికి సిజేరియన్ చేశారు. 568 (55 శాతం) మంది నార్మల్ డెలివరీ అయ్యారు.
నెల క్రితం నోటీసులు ఇచ్చినా..
యాదాద్రి జిల్లాలో సిజేరియన్ల సంఖ్య పెరిగిందని లెక్కలు తేలడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ భువనగిరి, చౌటుప్పల్డివిజన్ల పరిధిలోని 16 హాస్పిటల్స్‌ను గత నెలలో తనిఖీ చేసింది. ఈ సందర్భంగా గర్భిణులను రిపోర్ట్‌తోపాటు కేస్షీట్లను పరిశీలించారు. వీటిలో సిజేరియన్ఎందుకు చేయాల్సి వచ్చిందో సరైన కారణాలు పొందుపర్చలేదు. దీంతో 12 హాస్పిటల్స్రూల్స్కు విరుద్ధంగా సిజేరియన్చేశారని అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులకు ఇప్పటివరకు ప్రైవేట్హాస్పిటల్స్నిర్వాహకులు సమాధానం ఇవ్వలేదని సమాచారం. అయినప్పటికీ వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.