కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత .. వడ్ల కొనుగోలు స్లో

కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత .. వడ్ల కొనుగోలు స్లో
  • సెంటర్లలో కుప్పలు.. తెప్పలుగా వడ్లు
  • లోడింగ్​.. అన్​లోడింగ్​ తిప్పలే
  • సెంటర్లు ఓపెన్​ చేసి నెల దాటింది
  • కొనుగోలు 1.08 లక్షల టన్నులే
  • గత సీజన్ ఈ టైమ్​లో 1.50 లక్షల టన్నుల కొనుగోలు

యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. స్థానికంగా ఉండే హమాలీలు పెద్దగా ముందుకు రావడం లేదు. దీంతో బిహార్​కూలీలే దిక్కయ్యారు. అయితే కూలీల సంఖ్య తక్కువగా ఉండడంతో వడ్ల కొనుగోలుపై ప్రభావం పడుతోంది. ఈ యాసంగి సీజన్​లో 2.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. దిగుబడి 6 లక్షల టన్నుల వస్తుందని అంచనా వేశారు. కానీ సెంటర్లకు 4.50 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వరి కోతలు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. కొనుగోలు సెంటర్లకు పెద్ద ఎత్తున వడ్లు చేరుకుంటున్నాయి. సెంటర్లతోపాటు మార్కెట్​యార్డుల్లో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. 

1.08 లక్షల టన్నులు కొనుగోలు..

జిల్లాలో 375 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 52 సెంటర్లు సన్న వడ్ల కోసం కేటాయించారు. అయితే ఈ సీజన్​లో సన్న వడ్లు పండించేది తక్కువే. కాగా కొనుగోళ్లు మాత్రం 301 సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయి. అయితే వడ్ల కొనుగో లులో హమాలీల కొరత వేధిస్తోంది. ఇప్పటివరకు హమాలీగా చేస్తున్న వారు.. రెగ్యులర్​గా వర్క్​ చేస్తున్న మిల్లులో లేదా షాపుల్లో కొనసాగుతున్నారు. స్థానికంగా ఉన్న యువత హమాలీగా పని చేయడానికి ఇష్ట పడడం లేదు. దీంతో హమాలీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే కొనసాగుతున్నారు. అయితే డిమాండ్​కు అనుగుణంగా కూలీల సంఖ్య లేకపోవడంతో వడ్ల కొనుగోలుపై ప్రభావం పడుతోంది. గత సీజన్​లో ఇదే టైమ్​కు 1.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు మాత్రం 11,707 రైతుల వద్ద నుంచి 1.08 లక్షల టన్నులే కొనుగోలుచేయగలిగారు. 

లోడింగ్​.. అన్​లోడింగ్​ తిప్పలు..

హమాలీల కొరత కారణంగా సెంటర్ల వద్ద లోడింగ్, మిల్లుల్లో అన్​లోడింగ్​చేయడంలో ఆలస్యమవుతోంది. దీంతో సెంటర్లలో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయి. వడ్ల లోడ్​తో వెళ్లిన లారీలు మిల్లుల్లో నిలిచిపోతున్నాయి. 

బిహార్ కూలీల కోసం..

హమాలీల కొరతను అధిగమించడానికి సివిల్ సప్లయ్, పీఏసీఎస్ ఆఫీసర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. బిహార్ నుంచి కూలీలను రప్పించే ఏజెంట్లతో మాట్లాడుతున్నారు. దీంతో సదరు ఏజెంట్లు కూలీలను రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. చివరకు ఇంటి నిర్మాణ పనులకు వెళ్లే అడ్డమీది కూలీలను కూడా వడ్లను కాంటా వేయడంతోపాటు లారీల్లో లోడ్​ చేయించేందుకు తీసుకెళ్తున్నారు. వచ్చే వారంలో కొందరు ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

ఆకాశంలో మబ్బులు.. రైతులకు గుబులు..

వడ్ల కొనుగోలులో జాప్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పైగా తరచూ వానలు పడుతుండడంతో సెంటర్లలో వడ్లు తడిచిపోతున్నాయి. వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పుతున్నా.. కింద ఏమీ లేకపోవడంతో వాన నీళ్లు కుప్పల కిందకు చేరుతుండడతో  తడిచిపోతున్నాయి. దీంతో తేమ శాతం పెరగడంతో వడ్ల కొనుగోళ్లు మరింత ఆలస్యమవుతున్నాయి.