యాదాద్రి జిల్లాలో ఒకచోట తల్లి, మరోచోట శిశువు మృతి .. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

యాదాద్రి జిల్లాలో ఒకచోట తల్లి, మరోచోట శిశువు మృతి .. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
  • రంగంలోకి హెల్త్​ టీమ్స్​
  • ఈ నెలలోనే 3 అబార్షన్లు
  • వరుస ఘటనలతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
  • యాదాద్రి జిల్లాలోని ప్రైవేట్​ హాస్పిటళ్లు, డయాగ్నోస్టిక్​సెంటర్లలో తనిఖీలు

యాదాద్రి, వెలుగు: జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ​సెంటర్లపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ఈ నెలలోనే 3 అబార్షన్లు జరగడం, ఒకచోట తల్లి, మరోచోట శిశువు మృతిచెందడంతో అప్రమత్తమైంది. 6 హెల్త్​టీమ్స్​ను రంగంలోకి దించగా.. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

ఆడిందే ఆటగా కొన్ని ఆస్పత్రుల తీరు..

యాదాద్రి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. వాటికి జిల్లా వైద్యారోగ్య శాఖలోని కొందరు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పలు హాస్పిటల్స్​లో మెడికల్​కౌన్సిల్​లో రిజిస్టర్ అయిన డాక్టర్లు వైద్యం చేయడం లేదు. ఆస్పత్రి బోర్డు మీద ఒకరి పేరుంటే.. ఇతరులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఎంబీబీఎస్ పాసవని వారు, ఆర్ఎంపీలు నడిపిస్తున్న హాస్పిటల్స్​లో ఆర్​ఎంపీలే అన్ని రకాల వైద్యం అందిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయినా హెల్త్​డిపార్ట్​మెంట్​పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. 

ఒకే హాస్పిటల్​లో రెండు అబార్షన్లు

జిల్లాలో ఈ నెలలోనే 5 సంఘటనలు వెలుగు చూడడం హెల్త్ డిపార్ట్​మెంట్​కు షాక్ ఇచ్చినట్లయింది. భువనగిరిలో లింగ నిర్ధారణ అనంతరం రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో ముగ్గురు మహిళలకు అబార్షన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. వీటిలో రెండు అబార్షన్లను ఒకే హాస్పిటల్​లో చేయడం, పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేయడం తెలిసిందే. మరో ఆస్పత్రిలో అబార్షన్ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో హెల్త్ డిపార్ట్​మెంట్ విచారణ చేపట్టింది. 

అయితే గర్భం నుంచి శిశువు జారిపోయినందున తాము చికిత్స చేయించుకుంటున్నామని యాదగిరిగుట్ట మండలానికి చెందిన దంపతులు తెలపడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అలాగే చౌటుప్పల్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి చెందింది. భువనగిరిలోని మరో హాస్పిటల్​లో గర్భిణికి వైద్యం అనంతరం హైదరాబాద్​కు సిఫారసు చేయడం, అక్కడికి వెళ్లే సరికే గర్భంలోనే శిశువు మృతిచెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 

288 హాస్పిటళ్లు..

వరుస ఘటనల నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్​సెంటర్లలో  తనిఖీలు చేయాలని హెల్త్ డిపార్ట్​మెంట్ నిర్ణయించింది. ఇందుకు కలెక్టర్ హనుమంతరావు అనుమతి ఇవ్వడం, ప్రోగ్రాం ఆఫీసర్లతో 6 హెల్త్​టీమ్స్​ను ఏర్పాటు చేయడం వెంటనే జరిగిపోయాయి. ఒక్కో టీమ్​లో పీవో, డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ ఉంటారు. జిల్లాలో చిన్నాపెద్ద హాస్సిటల్స్, ఆయుర్వేద, హోమియో ఆస్పత్రులు 288 ఉన్నాయి. వీటితోపాటు స్కానింగ్ సెంటర్ల లిస్ట్​కూడా రూపొందించారు. ఇలా ఒక్కో టీమ్​కు హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు కలిపి 50 కంటే ఎక్కువగానే అప్పగించారు. 

అన్ని అంశాలపై ఆరా..

హెల్త్​టీమ్స్ జిల్లాలోని ప్రతీ హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్​ను తనిఖీ చేస్తోంది. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సహా వసతులు, డ్యూటీ డాక్టర్లుగా పేర్కొన్నవారే ప్రాక్టీస్ చేస్తున్నారా, ఆస్పత్రి రికార్డులు, డెలివరీ, చికిత్స తదితర అన్ని అంశాలపై ఆరా తీస్తున్నారు. హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన బెడ్స్ సంఖ్యకు అనుగుణంగా స్టాఫ్ ఉన్నారా లేరా చెక్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తున్నారు.