
- అంతకు మించితే ఊరుకోం : అడిషనల్కలెక్టర్లు
యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లకు అవసరమయ్యే సిమెంట్, స్టీల్, ఇటుక, ఇసుక రేట్లను యాదాద్రి జిల్లా ఆఫీసర్లు ఖరారు చేశారు. ఇంతకు మించకుండా ఇండ్లకు మెటీరియల్స్సప్లయ్ చేయాలని సరఫరాదారులకు సూచించారు. ఎక్కువ రేట్లకు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పేదకు సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం స్పీడప్ కావడంతో అవసరమైన ఇటుక, ఇసుక, స్టీల్, సిమెంట్ రేట్లను ఒక్ససారిగా సప్లయ్దారులు పెంచేశారు. ఈ విషయంలో ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్లు జి.వీరారెడ్డి, ఏ.భాస్కర్‌రావు రేట్లు ఫిక్స్ చేయడానికి రంగంలోకి దిగారు.
సరఫరాదారులతో సోమవారం ప్రత్యేకంగా మీటింగ్ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు సరఫరాదారులు టాక్స్ తగ్గించాలని, డబ్బు భూములున్న వారికి ఇండ్లు వచ్చాయని అనడంతో అడిషనల్ కలెక్టర్లు సీరియస్ అయ్యారు. అందరూ న్యాయంగానే వ్యాపారం చేస్తున్నారా..? తీసుకున్న అనుమతికి తగ్గట్టుగానే మట్టిని తోడుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. 'సహజ వనరులైన మట్టి, ఇసుక, స్టీల్, సిమెంట్‌లో ఎక్కువ లాభాలు ఆశించకుండా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు సహకరించాలని కోరారు.
అనంతరం హౌసింగ్ డిపార్ట్మెంట్, ఇంజినీర్ల లెక్కల ప్రకారం రూపొందించిన రేట్ల ప్రకారం సరఫరా చేయాలని సూచించారు. ఎక్కువ రేట్లకు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీటింగ్‌లో ఆర్డీవో కృష్ణారెడ్డి, మైనింగ్ ఈడీ రాఘవరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్ సింగ్, వివిధ మండలాల నుంచి సరఫరాదారులు ఉన్నారు.