యాదగిరిగుట్టకు తగ్గిన భక్తుల రద్దీ.. హైదరాబాద్లోని లాల్ దర్వాజా బోనాల ఎఫెక్ట్

యాదగిరిగుట్టకు తగ్గిన భక్తుల రద్దీ.. హైదరాబాద్లోని లాల్ దర్వాజా బోనాల ఎఫెక్ట్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఆలయానికి వచ్చే భక్తుల్లో 70 శాతం హైదరాబాద్ నుంచే  వస్తారు. ఆదివారం సిటీలో బోనాల పండుగ సందర్భంగా ఆలయంపై ఎఫెక్ట్ పడింది. వీకెండ్ వచ్చిందంటే భక్తులతో కిక్కిరిసే ఆలయ పరిసరాలు సందడి కనిపించలేదు. అరగంటలోపే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.31,64,411 ఆదాయం మాత్రమే వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

నారసింహుడిని దర్శించుకున్న ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ 
రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి శరత్ తన ఫ్యామిలీతో సందర్శించి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామివారి లడ్డూప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.