
- ఇప్పటికే ఉన్న లైన్లతో రద్దీ రోజుల్లో 4 గంటల సమయం..
- రూ.150 టికెట్ లైన్లు మొదలైతే టైం మరింత పెరిగే ఛాన్స్
- తాజా నిర్ణయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
యాదగిరిగుట్ట,వెలుగు : యాదగిరిగుట్ట నర్సన్న ధర్మ దర్శనానికి వచ్చే పేద భక్తుల కష్టాలు మరింత పెరగనున్నాయి. రూ.150 టికెట్ కొని వచ్చే భక్తులకు ప్రత్యేక లైన్ లేకపోవడంతో మరో ఆలోచన చేయని ఆలయ అధికారులు ధర్మ దర్శన క్యూ లైన్లను విడదీయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. రేపో మాపో ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఇప్పటికే రద్దీ సమయాల్లో నర్సన్నను దర్శించుకోవడానికి పేద భక్తులకు నాలుగ్గంటలు పడుతుండగా ఆలయ అధికారుల తీరుతో ఈ సమయం మరింత పెరగనున్నది.
ఇంతకుముందు ఎలా ఉండేదంటే..
ధర్మ దర్శనం క్యూ లైన్లు బస్ బే నుంచి మొదలవుతాయి. తర్వాత నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్ మొత్తం తిరుగుతూ గోల్డ్ క్యూలైన్ల గుండా ఆలయంలోకి
చేరుకోవాలి. ఇది సుమారు కిలోమీటర్ వరకు ఉంటుంది. వీరికి సాధారణ రోజుల్లో గంటలోపు దర్శనం అయిపోతుండగా..రద్దీ ఉన్న శని, ఆది, సెలవు దినాల్లో నాలుగు గంటలకు తగ్గడం లేదు. స్పెషల్దర్శన టికెట్ రూ.150 తీసుకున్న వారు మూడంతస్తుల క్యూకాంప్లెక్స్ నుంచి డైరెక్టుగా ఆలయ మాడవీధుల గుండా తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించేవారు. బస్ బే నుంచి క్యూకాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తే మూడంతస్తులు తిరిగేవారు. వీరికి రద్దీ లేకపోతే అరగంట ఉంటే గంటన్నరకు పైగా టైం పట్టేది. అయితే..వీఐపీ భక్తులకు మూడంతస్తుల క్యూకాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చాక..ఆలయ మాడవీధుల్లోకి చేరుకునే వరకు క్యూలైన్లు లేవు. రద్దీ రోజుల్లో రెండు వైపులా తాడుతో కట్టి తాత్కాలికంగా లైన్లు నడిపించేవారు. దీంతో వీరు ఎండలకు ఇబ్బందులు పడేవారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత సాధారణ, స్పెషల్ టికెట్ తీసుకున్న భక్తులు ప్రసాద కౌంటర్లు, శివాలయం వైపు వెళ్లాలంటే తాత్కాలిక క్యూ లైన్లతో ఇబ్బందులు పడేవారు.
ఇప్పుడేం చేశారంటే...
స్పెషల్ టికెట్ తీసుకునే భక్తులకు సమస్య ఏర్పడడంతో ఆలయ అధికారులు వారి కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సరైన ప్లాన్ లేకుండా అనుకున్నదే తడవుగా ధర్మ దర్శన లైన్లను రెండుగా విభజించారు. ధర్మదర్శన క్యూలైన్ల మధ్యలో ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయం మరో వారం పది రోజుల్లోనే అమల్లోకి రానుంది. ఇప్పటికే ధర్మ దర్శన లైన్లలో పేద భక్తులు గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతుండగా, వాటినే రెండుగా చేసి స్పెషల్ దర్శనానికి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రధానాలయ తూర్పు వైపున ఏర్పాటు చేసిన గోల్డ్ క్యూలైన్ల వెడల్పు తక్కువగా ఉంది. ఇందులో కూడా రెండు లైన్లు చేయడంతో దర్శనం మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. స్పెషల్ దర్శన భక్తులు తిరిగే దూరం పెరుగుతున్నా తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు ఏర్పడుతుండగా.. ధర్మదర్శన భక్తులకు ఇంకా ఎక్కువ సమయమే పట్టనుంది. ఇప్పటికే ఇరుకుగా ఉన్న ఉచిత దర్శన క్యూలైన్లను రెండుగా విభజించడంతో మరింత ఇరుకుగా మారాయి.
వందల కోట్ల ఆలయం... ఇదేం ప్లాన్ ?
సుమారు రూ.1200 కోట్లతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సరైన ప్లాన్లేదని ఇప్పటికే విమర్శలున్నాయి. ఆలయం రీ ఓపెన్ అయిన తర్వాత భక్తుల రాక భారీగా పెరిగింది. కానీ, సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్యూకాంప్లెక్స్ లో తప్పా ఓపెన్ ఏరియాలో టాయిలెట్స్, వాష్ రూమ్స్ లేవు. ప్రధానాలయ ప్రాంగణంలోనూ టాయిలెట్స్ నిర్మించలేదు. ఎండాకాలంలో వచ్చే భక్తుల కాళ్లు కాలుతుండగా, మాడు పగిలిపోతోంది. ఈ క్రమంలో స్పెషల్ టికెట్ తీసుకునే వారి కోసం ధర్మదర్శన లైన్లను రెండుగా విభజించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.