- ఉత్తర్వులు జారీ చేసిన యాదగిరిగుట్ట దేవస్థానం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తుల కోరిక మేరకు మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతి మంగళ, శనివారాల్లో ఉచితంగా నారసింహుడి గర్భాలయ దర్శనం కేవలం యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు మాత్రమే పరిమితం చేశారు. ఇకనుంచి యాదగిరిగుట్ట మండల ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ శనివారం దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
భక్తుల విజ్ఞప్తి మేరకు గత కొన్ని నెలల నుంచి యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు ఆధార్ కార్డు ప్రాతిపదికన ప్రతి మంగళవారం ఉదయం 8:15 నుంచి ఉదయం 9 గంటల వరకు.. ప్రతి శనివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు గర్భగుడిలో స్వయంభూ నారసింహుడి ఉచిత దర్శన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.
యాదగిరిగుట్ట మండల ప్రజలకు సైతం ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆలయ ఈవో భాస్కర్ రావు మండల ప్రజలకు స్వామివారి గర్భాలయ ఉచిత దర్శనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవో నిర్ణయంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.