
- నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పాత గుట్టలో మూడు రోజులుగా కొనసాగిన పవిత్రోత్సవాలు ముగిశాయి. బుధవారం ఉదయం పవిత్ర పవిత్రమాలధారణ, మహాపూర్ణాహుతితో అర్చకులు పవిత్రోత్సవాలకు ముగింపు పలికారు. అనంతరం భక్తులు, ఆలయ సిబ్బంది, జర్నలిస్టులకు పవిత్ర మాలధారణ చేశారు. ఏడాది నుంచి తెలిసీ తెలియక జరిగిన తప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా ఈ నెల 5 నుంచి నిలిపివేసిన ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలను గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. చివరి రోజు ఉత్సవాల్లో ఈవో వెంకటరావు, చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో జూశెట్టి కృష్ణ పాల్గొన్నారు.