- 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ
- స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టనున్న అర్చకులు
- 14న రామలింగేశ్వరస్వామి కల్యాణం, 17న మహాపూర్ణాహుతి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధమైన పర్వతవర్థినీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఇయ్యాల్టి నుంచి 17 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు స్వస్తివాచనంతో శివరాత్రి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13న ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
14న ఉదయం 10 గంటల నుంచి రుద్రహవనం జరిపించిన అనంతరం.. రాత్రి 7 గంటలకు రామలింగేశ్వరస్వామి కల్యాణం జరపనున్నారు. 15న శివరాత్రి సందర్భంగా.. ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేకాలు, రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు.
16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లక్షబిల్వార్చన, రాత్రి 7.40 గంటల నుంచి రథోత్సవం జరపనున్నారు. ఇక 17న మధ్యాహ్నం నిర్వహించే మహాపూర్ణాహుతి, డోలోత్సవంతో శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తుల సౌకర్యార్థం శివాలయ ముఖమంటపం మొత్తం చలువ పందిళ్లు వేయడంతో తాగునీటిని అందుబాటులో ఉంచారు. కల్యాణం, బిల్వార్చన, రుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కల్యాణంలో పాల్గొనడానికి ప్రత్యేక టికెట్లు
యాదగిరిగుట్ట పైగల శివాలయంలో జరగనున్న శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం వివిధ రకాల టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కల్యాణం, శతరుద్రాభిషేకం, లక్షబిల్వార్చన టికెట్ రేట్‌ను రూ. 516 చొప్పున నిర్ణయించగా... అభిషేకం టికెట్ ధరను రూ.300గా నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై దంపతులిద్దరికే ప్రవేశం ఉంటుందని ఆఫీసర్లు
తెలిపారు.
