ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది... పేర్ని నాని

ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది... పేర్ని నాని

ఏపీలో పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. శరవేగంగా దర్యాప్తు చేసిన సిట్ ఇప్పటికే ప్రాథమిక నివేదిక కూడా సమర్పించింది. ఘర్షణ జరిగిన జిల్లాల్లో పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి కౌంటింగ్ రోజున ఘర్షణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, కేసుల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి వ్యవహరిస్తోందంటూ అధికార వైసీపీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని,వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని అన్నారు.అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస జరుగుతుందని తెలిసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని, పాల్వాయిగేట్‌లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని అన్నారు.వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు పేర్ని నాని.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీన ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.ఈ ఘటనపై అప్పుడే టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని,ఈ విషయంలో  ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు పేర్ని నాని.