తిరుపతిలో వైసీపీ ఘన విజయం

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

2లక్షల 31 వేల పై చిలుకు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపు

తిరుపతి: పార్లమెంటు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. సుమారు 2 లక్షల 31 వేల 943 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తర్వాత పోస్టల్ ఓట్లు సహా  ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కనబరచిన వైసీపీ.. సగం రౌండ్లు పూర్తయ్యేసరికే విజయాన్ని ఖరారు చేసుకుంది. ఆ తర్వాత రౌండు రౌండులోనూ ఆధిక్యం పెరుగుతుండడంతో మెజారిటీపైనే వైసీపీ శ్రేణులు దృష్టి సారించాయి. ఊహించినట్లు రెండు లక్షల భారీ తేడాతో వైసీపీ గెలుపొందింది. 2019లో వైసీపీ 2 లక్షల 28 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్ల తేడాతోనే గెలుపొందింది. ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు విఫలయత్నం చేసింది. అధికార వైసీపీ ధాటిని తట్టుకుని 3 లక్షల 5 వేల పైచిలుకు ఓట్లు సంపాదించుకుంది.  జనసేన పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీ తొలిసారిగా ఏపీలో తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేసుకుంది. బీజేపీ 50 వేల 739 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 8 వేల 477 ఓట్లు సాధించుకుంది. మరో 13 వేల 401 మంది బరిలో నిలిచిన అభ్యర్థులెవరూ నచ్చలేదంటూ నోటాకు ఓటేశారు.

విధేయతకు పట్టం కట్టిన జగన్

తాను పాదయాత్ర చేసిన సమయంలో ఫిజియో ధెరపిస్టుగా సేవలు అందించిన డాక్టర్ గురుమూర్తి  విధేయతకు వైఎస్ జగన్ పట్టం కట్టారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసి భారీ మెజారిటీతో గెలిపించుకురావాలని పార్టీ శ్రేణులను పురమాయించడంతో పార్టీ సీనియర్ నేతలు కొంత అయిష్టత వ్యక్తం చేసినా.. జగన్ పరిస్థితిని గుర్తించి తన గీత దాటకుండా పార్టీ శ్రేణులను మొహరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ భారీ మెజారిటీని సాధించేలా కృషి చేసి సక్సెస్ సాధించారు. డాక్టర్ గురుమూర్తి వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడే కాదు.. ఆయన సోదరి వైఎస్ షర్మిళ పాదయాత్ర చేసినప్పుడు కూడా పిజియోథెరపిస్టుగా సేవలు అందించి వైఎస్ కుటుంబం పట్ల అపార భక్తని చాటుకున్నారు. అందుకు ఫలితంగా ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.