- ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న చందనాపూర్ బాధితులు
- పునరావాస కాలనీలో ఇండ్లు లేక ఊరికొకరుగా వలస
- కబ్జాలకు గురవుతున్న ప్లాట్లను కేటాయించాలని వినతి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చందనాపూర్ ప్రజలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇండ్లు, భూములు కోల్పోయారు. ఊరు ఆనవాళ్లు కూడా లేవు. ప్రాజెక్టు కోసం ఆస్తులను త్యాగం చేసిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించారు. అయితే కొందరికి నేటికీ పునరావాసం కింద కేటాయించాల్సిన ఓపెన్ ప్లాట్లు రాలేదు.
ఇండ్లు లేక, భూములు లేక బాధితులు వివిధ ప్రాంతాలకు వలసవెళ్లారు. తమకు ప్లాట్లు కేటాయించాలని పదేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని బాధితులు సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు చెప్పుకుని వాపోయారు.
రెండు దశల్లో 230 మందికి పంపిణీ
ఎల్లంపల్లి ప్రాజెక్టులో వ్యవసాయ భూములతో పాటు ఇండ్లు, జాగాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఒకవేళ ప్లాటు తీసుకోకపోతే రూ.3.75 లక్షల ప్యాకేజీ అందించాలి. కాగా.. గ్రామానికి చెందిన 280 మంది అర్హులు ఉండగా, తొలి విడతలో 2015, అక్టోబర్ 26న 160 మందికి రెండు గుంటల చొప్పున ప్లాట్లు కేటాయించారు.
2016, సెప్టెంబర్16న మరో 70 మందికి.. ఇలా మొత్తంగా 230 మందికి ఓపెన్ ప్లాట్లు ఇచ్చారు. మిగతా 50 మంది భూ నిర్వాసితులకు ఇప్పటికీ ప్లాట్లు అందలేదు. పునరావాస కాలనీ ఏర్పాటుకు అధికారులు ప్రైవేటు భూములు సేకరించారు. కొందరు రైతులు తమ భూములను ఇవ్వమని హై కోర్టుకు వెళ్లారు. దీంతో ప్లాట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. నేటికీ హై కోర్టులో కేసు పెండింగ్‌లోనే ఉంది.
కబ్జాలకు గురైన ప్లాట్లు
చందనాపూర్ పునరావాస కాలనీలో పంపిణీ చేయకుండా మిగిలిపోయిన ఓపెన్ ప్లాట్లు కబ్జాలకు గురయ్యాయి. కోర్టు కేసులో ఉన్న భూమిని ఆనుకొని దాదాపు 30 వరకు ప్లాట్లు ఉన్నాయి. ఇవి రెండు గుంటల కంటే తక్కువగా ఉండడంతో అధికారులు నిర్వాసితులకు పంపిణీ చేయడం లేదు. వీటిలో 20, 21, 34 నుంచి 38, 52, 75 నుంచి 78, 80, 94, 99, 204, 205, 239, 240, 256 నుంచి 258, 308 నంబర్వరకు ప్లాట్లు ఆక్రమించేశారని బాధితులు వాపోతున్నారు.
కబ్జాదారుల్లో కొందరికి లోకల్లీడర్ల సపోర్టు ఉందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, కోర్టు కేసు ఇప్పట్లో తెగేలా లేదని, తమకు రూ.3.75 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని, ఆరేండ్ల కింద దరఖాస్తు చేసుకున్నారు. అటు ప్లాట్లు రాక ఇటు ప్యాకేజీ అందక ఇబ్బందులు పడుతున్నారు. కబ్జాలకు గురైన ప్లాట్లను స్వాధీనం చేసుకుని వెంటనే తమకు కేటాయించాలని భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు.
ప్లాట్ రెండు గుంటల కంటే తక్కువగా ఉన్నప్పటికీ తాము సర్దుకుపోతామంటున్నారు. మిగిలినవారికి గుడిపేట పునరావాస కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్లను కేటాయించాలని కోరుతున్నారు. దీనిపై పలుమార్లు అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ప్రస్తుతం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో పాటు కలెక్టర్లను కలిసి విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదేండ్లుగా పట్టించుకోవట్లే..
ఎల్లంపల్లి ప్రాజెక్టులో నా ఆరెకరాల వ్యవసాయ భూమితో పాటు ఇల్లు కోల్పోయాను. అప్పట్లో ఎకరానికి రూ.1.85 లక్షల నష్టపరిహారం చెల్లించారు. కానీ, నాకు పునరావాస కాలనీలో ప్లాట్రాలేదు. పదేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలనీలో జాగా లేక ఇల్లు కట్టుకోలేదు. వెల్గటూర్‌లో ఉంటున్నా. - దొమ్మాటి మల్లయ్య, చందనాపూర్
వెంటనే ప్లాట్లు ఇవ్వాలి
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సాగు భూములు, పుట్టిపెరిగిన ఇండ్లు అన్నీ వదులుకున్నాం. నా 15 ఎకరాల భూమి ప్రాజెక్టులో పోయింది. అప్పట్లో నష్టపరిహారం కూడా తక్కువే ఇచ్చారు. పదేండ్లయినా పునరావాస కాలనీలో ప్లాట్ఇవ్వలేదు. కబ్జాలకు గురవుతున్న ప్లాట్లను కేటాయించి మాకు న్యాయం చేయాలి.- దొమ్మాటి పోశెట్టి, చందనాపూర్
వెంటనే ప్లాట్లు ఇవ్వాలి
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సాగు భూములు, పుట్టిపెరిగిన ఇండ్లు అన్నీ వదులుకున్నాం. నా 15 ఎకరాల భూమి ప్రాజెక్టులో పోయింది. అప్పట్లో నష్టపరిహారం కూడా తక్కువే ఇచ్చారు. పదేండ్లయినా పునరావాస కాలనీలో ప్లాట్ఇవ్వలేదు. కబ్జాలకు గురవుతున్న ప్లాట్లను కేటాయించి మాకు న్యాయం చేయాలి.- దొమ్మాటి పోశెట్టి, చందనాపూర్
