
తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు నిండుకుండలా మారింది. దీంతో గురువారం (ఆగస్టు 28) సాయంత్రం 40 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు అధికారులు.
గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ముఖ్యంగా జైపూర్ మండలం వేలాల గ్రామం శివారులో వరద చేరడం తో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు ఇప్పటికే మునిగిపోయాయి. వేలాలతో పాటు కిష్టాపూర్, పౌనూర్, శివ్వారం గ్రామాలకు ముంపు ప్రమాదం ఉండటం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల మునిగిన పంట పొలాలు సర్వే పంటనష్టం ఇస్తామని హామీ ఇచ్చారు. వరద ఉధృతి పెరిగితే గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
►ALSO READ | ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉధృతి..శంభుమత్తడిగూడ వాగులో చిక్కుకున్న చిన్నారులు.. వేలాలలో నీటమునిగిన పత్తిచేన్లు..
వరద మరో రెండు రోజులు కొనసాగనుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని.. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకి వెళ్ళకూడదని సూచించారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఫోన్ చెయ్యాలని.. అందుబాటులో ఉంటాని భరోసా ఇచ్చారు - మంత్రి వివేక్ వెంకటస్వామి.