యూరిన్​ సమస్యలకు ఆసనాలు

యూరిన్​ సమస్యలకు ఆసనాలు

మూత్ర విసర్జనను నియంత్రించుకోలేకపోవటం.. దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌‌ అవటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సిరావటం.. ఇలా మూత్ర సంబంధ సమస్యలెన్నో! వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు  ఇదే  సమస్య. అయితే కొన్ని ​ యోగాసనాలు వేస్తే   ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఉత్కటాసనం..

యోగా మ్యాట్​పైన  రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. రెండు చేతులు దండం పెడుతున్న పోజ్ లోకి తీసుకురావాలి. చేతులను తలపైకి అలాగే లేపాలి. ఇప్పుడు మెల్లగా మోకాళ్ళ దగ్గర వంచి శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకోవాలి. ఇలా ఐదారు సెకండ్లు చేయాలి. ఇలా చేయడం వల్ల  మూత్రం లీకేజ్​ సమస్య తగ్గుతుంది.

 

 

బద్ధ కోణాసనం

యోగా మ్యాట్​పై   రెండు కాళ్లని చాపి కూర్చోవాలి. తర్వాత  రెండు కాళ్లని లోపలి వైపుకి ఫొటోలో చూపిన విధంగా మడిచి  అరికాళ్లను పొట్ట  భాగానికి ఆన్చాలి. అరికాళ్లు ఒకదానికి ఒకటి తాకేలా చేస్తూ రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. చేతివేళ్లను జాయింట్ చేసినట్లుగా పాదాలను కలిపి.. మోకాళ్లను నేలకు దగ్గరగా ఉంచాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేయాలి. ఈ ఆసనాన్ని రెగ్యులర్​గా చేస్తే మూత్రాశయ  సమస్యలు తగ్గుతాయి.

 

త్రికోణాసనం

నిటారుగా నిల్చొని కాళ్లు రెండూ దూరం పెట్టి చేతులు పక్కకు చాపాలి. ఇప్పుడు కుడిచేతి వేళ్లని  తీసుకువచ్చి కుడివైపు నేలకు ఫొటోలో చూపిన విధంగా తాకించాలి. ఎడమచెయ్యి పైకి ఎత్తాలి. తలని పైకెత్తి చేతిని చూడాలి. చేతులు మారుస్తూ  ఇలా 20, -25 సార్లు చేయొచ్చు. క్రమంగా పెంచుకోవచ్చు. నడుము నొప్పి  ఉన్నవారు ఈ ఆసనం వేయొద్దు. ఒకవేళ చేయాలనుకుంటే పూర్తిగా వంగకూడదు. మొదట్లో మెల్లిగా మొదలుపెట్టి క్రమంగా ఎక్కువసార్లు చేయాలి. అలాగే ఈ ఆసనం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. భోజనం చేశాక చేయాలనుకుంటే నాలుగు గంటల తరువాత చేయాలి. ఈ ఆసనం వల్ల మూత్రాశయ సమస్యలు దూరమవుతాయి.

బాలాసనం

ఈ ఆసనం కోసం మోకాళ్లని మడిచి  పిరుదులు కాలి పాదాలపై ఆన్చాలి.  ఫొటోలో చూపిన విధంగా శరీరాన్ని ముందుకు వంచి ఛాతిని మోకాళ్లకు ఆన్చాలి.  తర్వాత నుదుటిని నేలకు ఆన్చి చేతులను ముందుకు చాపాలి. ఈ పొజిషన్​లో పదిసార్లు గాలి పీలుస్తూ వదలాలి. ఇలా చేయడం వల్ల  మూత్ర సమస్యతో పాటే అలసట, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతాయి.

 

మలాసనం..

యోగా మ్యాట్​పై   రెండు కాళ్లని దూరంగా ఉంచి నిలబడాలి. తర్వాత నెమ్మదిగా ఫొటోలో  చూపినట్టుగా చేతులను నమస్కార ముద్రలో ఉంచి  కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.  అలాగే రెండు మోకాళ్ల మధ్యలో నమస్కార ముద్ర ఉండాలి. ఈ పొజిషన్​ 15 నుంచి 20 సెకన్లు ఉండి తర్వాత ఆసనం నుంచి బయటకు రావాలి. ఇలా  రెగ్యులర్​గా చేయడం వల్ల మూత్రం లీకేజ్​ సమస్యతో పాటు యూరిన్​ ఇన్​ఫెక్షన్స్​ కూడా  తగ్గుతాయి.