ప్రపంచానికి మన యోగా

ప్రపంచానికి మన యోగా

“యోగం” భారత దేశంలో అనాదిశాస్త్రం, ఇది హైందవ ధర్మానికే కాదు అన్ని మతాలకు ఆయువుపట్టు, యోగవిద్య శారీరక పరిశ్రమ కాదు. అదొక ఆత్మవిజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానంతో పరమాత్మను తెలిపే శాస్త్రమే యోగశాస్త్రం. అలాంటి ప్రాచీన యోగవిద్య ఎందరో దేవతలు, గురువులు చెప్పారు. కానీ బ్రహ్మదేవుడు చెప్పిన ‘హిరణ్యగర్భయోగం’ అనే ప్రాచీన యోగం యాజ్ఞవల్క్యమహర్షి జనకసభలో గార్గికి చెప్పాడు. ఆ చెప్పిన రోజు ‘మాఘపౌర్ణిమ’ దీన్ని మహామాఘి అని పిలుస్తారు.

 ఇదే యోగా జయంతి. కానీ జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి ‘యోగా దినోత్సవం’గా గుర్తించింది. జూన్ 21 నాడు సూర్యుడు - భూమికి సంబంధించిన ఖగోళ విశేషం అన్ని దేశాలకు సమానమైన ఓ ‘సృష్టి అద్భుతం’ జరుగుతుంది. అందుకే దీన్ని ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించారు. ప్రపంచానికి భారతీయులు ఇచ్చిన ‘యోగ’ ‘యుజ్’ అనే ధాతువు నుంచి వచ్చింది. ఇక్కడ జీవాత్మను పరమాత్మతో కలపడమే ‘యోగం’. ఇది తెలియజేయడానికే ‘యుజ్ సమాధే’ అనుధాతువును “యుజర్యోగే” అనే రెండింటిని పాణిని తన ధాతు పాఠంలో స్వీకరించాడు. అందుకే జీవాత్మను పరమాత్మతో కలపడమే ‘యోగం’ అన్నాడు యాజ్ఞవల్క్యుడు. 

యోగాతో లాభాలు

అన్నింటిలో యోగమే మహోన్నతమైంది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో -అర్జునా! తపస్సు చేసిన వారికన్నా, జ్ఞానికన్నా, కర్మలాచరించువాడికన్నా “యోగి” అధికుడు. కాబట్టి యోగివికమ్ము అని ఘంటాపథంగా చెప్పాడు. కాబట్టి సమాజాన్ని ‘యోగమయం’ చేయాల్సిన అవసరం ఉంది. విశ్వవ్యాప్తం చేయాల్సిన యోగాను వివాదాస్పదం చేయడం సముచితం కాదు. బౌద్ధంలో ధ్యానాన్ని ‘జెన్’ అంటారు. అది జపాన్ యోగవిధానం. బుద్ధుడు చైనాలో ధ్యానాన్ని పరిచయం చేశాడు. చైనాలో ధ్యానం ‘ఝాన్’ గా మారింది. తర్వాత ఆ పదం జపాన్లో ‘జెన్’గా మారింది. మనోవ్యాపారాన్ని అరికట్టే అద్భుతశక్తి ‘జెన్’కు ఉంది. దానినే పతంజలి ‘యోగశ్చిత్తవృత్తి నిరోధః’అని పేర్కొన్నాడు. 

కోట్ల మార్లు పూజ, స్తోత్రం, జపం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో అది ఒక్కసారి ‘యోగ’ చేయడం వల్ల కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ యోగ అంటే మనం చేసే అష్టాంగ యోగం కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనేవి అష్టాంగాలు. మనిషి అసలైన యోగాభ్యాసం చేయడానికి సంసిద్ధుణ్ణి చేసేవి ఇవి. యమనియమాది అష్టాంగాల అభ్యాసం వల్ల అశుద్ధి, అవిద్య నశిస్తుంది. యమం అనేది క్రమశిక్షణను కలిగిస్తుంది. ఇందులో అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం అపరిగ్రహం అనేవి అంతర్భాగాలు. ‘యమం’ ఆచరించాలంటే ఈ ఐదు ఆచరించాలి. ఇవి వ్యక్తి శారీరకమైనవి. అలాగే నియమంలో శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అనే విభాగాలు ఉంటాయి. ఇవి వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడానికి పనికివస్తాయి. ఆసన, ప్రాణాయామాల వల్ల ఆరోగ్యం, శరీరం, మనస్సు స్థిరమవుతాయి. 

బాహ్య విషయాలైన శబ్దాదుల నుంచి ఇంద్రియాలను వెనక్కి మరల్చడానికి పనికి వచ్చేది ప్రత్యాహారం(నిగ్రహం). ఒకేఒక విషయంలో మనస్సును నిలిపేది ధారణ(దీక్ష). మనస్సును చిత్తంగా మార్చి అంతర్ముఖుడు కావడానికి ‘ధ్యానం’పనికి వస్తే, ఆ ధ్యానాన్ని స్థిరంచేసి పరమాత్మ దర్శనం చేయడానికి సమాధి పనికి వస్తుంది. కానీ ఈరోజు ఆరోగ్యం కోసం కొన్ని ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం మాత్రమే మనం చేస్తున్నాం. యోగ సాధన ద్వారా శరీరంలో నిరోటోనిన్ ధాతువు బాగా వృద్ధి చెంది, మెదడులోని న్యూరోట్రాన్స్ మిషన్ క్రమబద్ధీకరణ జరుగుతుంది. పతంజలి యోగం ప్రకారం మన శరీరంలో నాడీ కేంద్రాలు, శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని ‘ధనాత్మక శక్తి’తో నింపడమే యోగ చేసే మొదటి మేలు. మన దేహంలోని మూలాధార శక్తి 'పెల్విక్ ప్లక్షస్’కు సింబల్. ఈ శక్తి పరిరక్షణ వల్ల ప్రొస్టేట్ గ్రంథి, 'కటివలయపు నాడీబంధనాలు’ సురక్షితంగా ఉంటాయి. వెన్నుపూసను స్వాధిష్ఠానచక్రం, కాలేయాన్ని మణిపూరకచక్రం, గుండెను అనాహతచక్రం, ఊపిరితిత్తులను విశుద్ధచక్రం సదా రక్షిస్తూ ఉంటాయి. ఆయా చక్రాల్లో యోగ ద్వారా మనం శక్తిని నింపి, చైతన్యపర్చగలిగితే అవి ఆరోగ్యంగా ఉంటాయి.

ఎంతో మంది కృషి

యోగసాధకులు తమ మనస్సును ఏకోన్ముఖం చేసి ఆసన, ప్రాణాయామ, ధ్యానాలను అభ్యాసం చేస్తే శరీరానందంతో పాటు, ఆత్మానందం పొందవచ్చు. అందుకే మన దేశంలో యోగ ఋషులు మనకు గొప్పవరం ప్రసాదించారు. సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త దాకా పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధింపజేసేది యోగ. బంధనాలు లేని జీవనం నుంచి ముక్తి కల్పించే మహత్తర శక్తి యోగాకు ఉంది. భారతదేశంలో యోగశాస్త్రానికి, అధ్యయనానికి, సాధనకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. కృతయుగంలో హిరణ్యగర్భుడు అనే పేరుగల బ్రహ్మ యాజ్ఞవల్క్యమహర్షికి, గార్గేయి అనే స్త్రీకి మొదటిసారి యోగప్రబోధం చేశారు. దాన్ని ‘బ్రహ్మయోగం’ అంటారని ప్రముఖ తెలంగాణ తాళపత్ర పరిశోధకులు నాగలింగ శివయోగి నిరూపించారు. త్రేతాయుగంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి చెప్పిన యోగ రహస్యాలు, యోగవాశిష్ఠంగా, భగవద్గీత యోగశాస్త్రాల్లో ప్రముఖమైనది. 

చాలా పురాణ కథలు పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లుగా ఉంటాయి. 195 సూత్రాల్లో యోగాన్ని చెప్పిన పతంజలి మహర్షి యోగశాస్త్రానికి పితామహుడుగా పేరొందాడు. పతంజలితో పోల్చదగిన వ్యక్తి మరెవరూ లేరు. మానవజాతి చరిత్రలో ప్రథమంగా మతానికి శాస్త్ర ప్రమాణం కల్పించాడు. సూత్రాలు, నమ్మకాలు లేని విధంగా మతాన్ని శాస్త్రంగా మలిచాడు. పతంజలి అరుదైన యోగశాస్త్రవేత్త. అతడు బుద్ధుడిలా, శంకరుడిలా, మహావీరుడిలా జ్ఞానోదయం కలవాడు. 

పతంజలిని మనం అనుకరించడం మొదలుపెడితే ఓ గణితసూత్రం ఎంత కచ్చితంగా ఫలితం ఇస్తుందో ‘పతంజలి యోగం’ అంతే కచ్చితమైన ఫలితం ఇస్తుంది.  చరిత్రలో ఎంతో మంది యోగసంప్రదాయాన్ని ‘భారతీయత’ గా ప్రచారం చేశారు. ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తున్న మధుమేహం, రక్తపోటు వంటి రోగాలను, అశాంతి జీవనంతో కొని తెచ్చుకుంటున్న భయంకర వ్యాధులను తగ్గించే శక్తి యోగాకు ఉన్నట్లు లక్షలాది మంది స్వస్థత పొంది నిరూపిస్తున్నారు. అంతేగాకుండా ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్వహించిన సంయుక్త సర్వేలో ప్రపంచ జనాభాలోని 40 కోట్ల మంది అత్యవసర వ్యాధుల వల్ల 80 శాతం ప్రజలు పేదరికంలోకి వెళ్తున్నారని తేలింది. మరి ఇలాంటి తరుణంలో ప్రపంచాన్ని ‘ఆరోగ్య ధరిత్రి’గా చేయాల్సిన బాధ్యత ప్రతి మతంవారిపై ఉంది. గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లే!

 డా. పి. భాస్కరయోగి సోషల్​ ఎనలిస్ట్