Good News : గుడికి వెళితే ప్రశాంతంగా ఉంటారా.. పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది..!

Good News : గుడికి వెళితే ప్రశాంతంగా ఉంటారా.. పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది..!

రోజు ఎన్నో ఆందోళనలు, ఒత్తిళ్ల మధ్య జీవిస్తూ ఉంటారు కొంతమంది. అలాగే కొందరు ఏ ఆందోళన కలిగినా వేడుకునేందుకు గుడికి వెళ్తుంటారు.. కానీ దేవుడి కంటే ముందే ఆ దేవాలయ ప్రాంగణం మన ఒత్తిడులన్నిటిని తొలగిస్తుంది. కాసేపు అలా గుడిలో కూర్చొని వస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. "ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావ్?' అని అడిగితే 'ఇప్పుడే గుడికి వెళ్లొచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంది' అని చెప్తుంటారు.

ప్రశాంతతకు అదే కారణం

దైనందిన జీవితంలో అన్నింటితో పాటు భక్తికి కొంత స్థానం కల్పించుకున్నారు. అందుకే ఎన్ని పనులున్నా ఒక రోజు కేటాయించుకుని గుడికి వెళ్తుంటారు. అది మనుషుల జీవన శైలికి ఒక స్ఫూర్తిని, తగినంత ఓర్పును, మానసిక ప్రశాంతతని ప్రసాదిస్తుందని విశ్వాసం. మనిషికి, దేవుడికి మధ్య వారధి గుడి. గుడికి వెళ్లగానే తెలియకుండా మన మనసు ప్రశాంతంగా మారిపోడానికి అనేక కారణాలున్నాయి.

పాజిటివ్ ఎనర్జీ

భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తుంటాయో అక్కడే ఆలయాలన్నీ నిర్మించబడి ఉంటాయి. ఇండా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలన్నీ ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే శరీరం, మనసు ప్రశాంతతను పొందుతాయి. దేవాలయ గర్భ గుడిలో మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహా యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉందుతారు. పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా లోహం గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. దాని వలన శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్లే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి అంతగా కనిపించకపోయినా రోజూ గుడి వెళ్లే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

విలువైన ఆచారాలు

దేవాలయ నిర్మాణం నుంచి దేవాలయంలో ఆవరించే పద్ధతుల వరకు అన్నీ ఆత్మను పరమాత్మకు దగ్గర చేసే విధంగానే రూపొందించబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన వెంటనే చేసే కొన్ని ఆచరణలు మన మనసుని లౌకిక వ్యవహారాల నుంచి భక్తి స్థితికి మారుస్తాయి. చెప్పులు, తలపాగా విడవడం, ప్రదక్షిణలు చేయడం, తల వంచి దేవుడికి సమస్కరించడం, భగవన్నామస్మరణ చేయడం. వీటితో మన మనస్సు తెలియకుండానే దేవుని వైపు మళ్లుతుంది.

గుడిలోని గంట ఓంకార శబ్దానికి ప్రతీకం. గుడికి వెళ్లినప్పుడు గంట కొట్టి కళ్లు మూసుకొని దేవుడికి దండం పెట్టడం ఆచారం. ఈ గంట ప్రాపంచిక ధ్వనులన్నీ సమసిపోయి కేవలం ఓంకార శబ్దం మాత్రమే చెపుల్లో ధ్వనించేలా చేస్తుంది. ఆ ధ్వనిని వింటూ కళ్లు మూసుకొని పరమాత్మరూపాన్ని ధ్యానిస్తే ఎనలేని ప్రశాంతత చేకూరుతుంది. గంటతో పాటు ఆలయాల్లో వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి. మనసును చైతన్య పరుస్తాయి.. 

గుడిలో మనకు కనిపించే మరో ఆచారం హారతి. హారతి ఇచ్చేటప్పుడు కర్పూరపు వాసనలు పీల్చుకోవటం సహజం. కర్పూరం దుర్గంధాన్ని తొలగించి, నాసికా రంధ్రాలను స్వచ్ఛం చేస్తుంది. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు చక్కగా జరిగేట్లు చేస్తుంది. హారతితో పాటు గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే పరిమళాలు శరీరాన్నీ ఉత్తేజపరుస్తాయి. గుడిలో ఇచ్చే తీర్థ ప్రసాదాల పట్ల కూడా ఎనలేని మేలు జరుగుతుంది. గుడిలో ఇచ్చే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పదలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు.. ఇవన్నీ ఎన్నీ ఔషధ గుణాలు కలిగినవి. 

చివరగా దర్శనానంతరం కొంతసేపు కూర్చోవటం ఆచారం. వెంటనే ప్రాపంచిక అవసరాల వైపు పరుగెత్తకుండా కొంత సేపు ధ్యానం చేస్తూ ఆలయ వాతావరణంలో గడపడంద్వారా మనసుకు విశ్రాంతి కలుగుతుంది. ఇలా శరీరంలోని అన్ని ఇంద్రియాలను దేవాలయం ఉత్తేజపరుస్తుంది. అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం కలిగిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు కలుగుతుంది. కనుక ఆలయానికి వెళ్తే ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

భక్తి భావం

ఒడిదొడుకులకు అతీతమయినది భక్తి. భక్తితో ఇష్టదైవాన్ని ఆరాధిస్తే మనఃశ్శాంతి కలుగుతుంది. మనసులో చెడు ఆలోచనలకు తావుండదు. సన్మార్దములో నడిచేందుకు వీలుపడుతుంది. ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. నిత్యజీవనంలో ఒత్తిళ్ళను, ఒడిదొడుకులను తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎనభై శాతం శారీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణం. భక్తి తో వీటన్నింటినీ అధిగమించవచ్చని పండితులు చెబుతున్నారు.