కేజ్రీవాల్ సీఎం అయ్యాక వాటిని మర్చిపోయిండు

కేజ్రీవాల్ సీఎం అయ్యాక వాటిని మర్చిపోయిండు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార మత్తులో ఉన్నారని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆరోపించారు. మద్యం మత్తులాగా అధికార మత్తు ఉంటుందని.. ప్రస్తుతం నువ్వు అదే మత్తులో ఉన్నావని కేజ్రీవాల్ ను ఉద్ధేశిస్తూ అన్నా హజారే లేఖ రాశారు. ఈ లేఖలో  ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వరాజ్ పుస్తకంలో మద్యం విధానాలపై కేజ్రీవాల్ ఆదర్శప్రాయమైన విషయాలు రాశారని.. అయితే సీఎం అయ్యాక వాటిని మర్చిపోయారని విమర్శించారు.

కొత్త ఎక్సైజ్ పాలసీ మద్యాపానాన్ని ప్రోత్సహించేలా ఉందన్న అన్నాహజారే.. ఈ విధానం ద్వారా అవినీతికి తెరదీసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ పాలసీ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడదని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పార్టీకి సన్నిహితులైన వారు లబ్దిపొందారని.. ఇటువంటి తప్పుడు పాలసీ దేశంలో ఎక్కడా ఉండదని మండిపడ్డారు. ఆప్ మిగితా రాజకీయ పార్టీలకంటే భిన్నంగా ఏంలేదని విమర్శించారు.

బలమైన లోక్ పాల్, అవినీతి చట్టాలకు బదులు మద్యం పాలసిని తీసుకొచ్చారని.. ఇది ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమని అన్నాహజారే అన్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.