
టైంపాస్ కోసమో లేదా మౌత్ ఫ్రెష్‌నర్‌లా పనిచేస్తుందనో చాలామంది చూయింగ్ గమ్ నములుతుంటారు. అయితే నోటి దుర్వాసన మాట అటుంచితే ఈ అలవాటుతో బోలెడు లాభాలున్నాయంటున్నారు సైంటిస్టులు.
చూయింగ్ గమ్.. బరువు తగ్గడానికి సాయపడుతుందని ఫిజికల్ థెరపీ సైన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఒక స్టడీలో వెల్లడైంది. ఏదైనా పని చేస్తూ చూయింగ్ గమ్ నమలడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. శరీరంలోని అదనపు క్యాలరీలు బర్న్ అవుతాయి. అలా చూయింగ్ గమ్‌తో బరువు తగ్గొచ్చు. అలాగే మరో స్టడీ ప్రకారం చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవాళ్లలో ఇతరుల కంటే ఐదు శాతం ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయని తేలింది.
చూయింగ్ గమ్ ఆకలిని కూడా తగ్గిస్తుందని మరో స్టడీలో తెలిసింది. ముఖ్యంగా భోజనానికి ముందు, తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల శ్నాక్స్ లేదా స్వీట్లు తినాలనే కోరికలు తగ్గుతాయట.
చూయింగ్ గమ్‌తో క్యాలరీలు కరిగినప్పటికీ అదే పనిగా చూయింగ్ గమ్ నమిలితే దంత క్షయం, దవడ నొప్పి, కడుపు నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని మరీ తరచుగా కాకుండా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు చూయింగ్ గమ్ నమలడం మంచిది. అది కూడా షుగర్ ఫ్రీ గమ్ అయితే చాలా బెటర్.