లిస్ట్​లో పేరుంటే ఓటేయొచ్చు .. ఎన్నికల కమిషన్ వెల్లడి

లిస్ట్​లో పేరుంటే ఓటేయొచ్చు .. ఎన్నికల కమిషన్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయొచ్చని ఎన్నికల కమిషన్​ తెలిపింది. ఓటరు గుర్తింపు నిర్ధారణ సమయంలో ఎపిక్(ఫొటోతో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు) పరిశీలన సందర్భంగా- క్లరికల్, స్పెల్లింగ్ తప్పుల వంటి వాటిని పోలింగ్ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరొక అసెంబ్లీ నియోజకవర్గం రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసిన ఎపిక్ కార్డును ఓటరు చూపితే, ఆ ఓటరు పేరు పోలింగ్ స్టేషన్‌‌‌‌కు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే, ఆ ఎపిక్ ను గుర్తింపు కోసం అనుమతించవచ్చని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా నిరోధించడంతో పాటు, అసలైన ఓటర్లను గుర్తించి వారు  సౌకర్యవంతంగా ఓటు వేయడానికి వీలు కల్పించాలని ఈసీ పేర్కొంది. ఈ మేరకు సీఈవో వికాస్​రాజ్​ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో చూపాల్సిన గుర్తింపు కార్డులపై బుధవారం ప్రకటన రిలీజ్​చేశారు. 

ప్రత్యామ్నాయ కార్డులు

ఓటరు కార్డు లేని వారు తమ గుర్తింపును నిర్ధారించడానికి ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు,  బ్యాంక్/పోస్ట్ ఆఫీస్(ఫోటోతో ఉన్న) పాస్‌‌బుక్‌‌లు, కార్మిక మంత్రిత్వ శాఖ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్,  పాన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్‌‌పోర్ట్,  ఫొటోతో ఉన్న పింఛను పత్రం, ఉద్యోగులకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు,  చట్ట సభల సభ్యత్వాన్ని చూపే అధికారిక గుర్తింపు, దివ్యాంగుల గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు. ఓటరు తన పోలింగ్ స్టేషన్‌‌ను, ఓటర్ల జాబితాలోని తన  క్రమ సంఖ్యను,  పోలింగ్ తేదీ, సమయం వంటి వివరాలు తెలుసుకోవడానికి వీలుగా ‘ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్’ జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాబితాలో ఉన్న  ఓటర్లు అందరికీ పోలింగ్ తేదీకి కనీసం 5 రోజుల ముందు ఓటరు సమాచార స్లిప్ అందించనున్నారు. ఓటర్ల గుర్తింపును నిర్ధారించడానికి మాత్రం ఈ ఓటర్ స్లిప్పును అంగీకరించరు. భారత పాస్‌‌పోర్ట్‌‌లోని వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో నమోదైన ప్రవాస ఓటర్లను పోలింగ్ స్టేషన్‌‌లో వారి అసలు పాస్‌‌పోర్ట్ ఆధారంగా మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. దీనికి ఇతర ఏ గుర్తింపు పత్రం పరిశీలించకూడదని పేర్కొన్నారు.

ALS0 READ: ఓటు వజ్రాయుధం.. స్వేచ్ఛగా వినియోగించుకోండి: వి.పి.గౌతమ్