పతకంతో పాటు రోడ్డు తెచ్చింది

పతకంతో పాటు రోడ్డు తెచ్చింది

పాల్గొంటున్నది మొదటి ఒలింపిక్స్. అయితేనేం, తనలో ఏ బెరుకు లేదు. ప్రపంచ చాంపియన్​షిప్​ లో గెలిచిన అనుభవం ఉంది. దానికి తోడు ఎలాగైనా పతకం సాధించాలన్న కసి, పట్టుదల. పైగా యువరక్తం. తన పంచ్​ పవర్​తో బాక్సింగ్​లో కాంస్య పతకం సాధించింది లవ్లీనా బొర్గోహెన్​. మూడో పతకాన్ని అందించి దేశమంతా గర్వపడేలా చేసింది. అంతేనా.. ఊరికి రోడ్డు  కూడా తెచ్చింది. 

వీడియో కాల్ సెంటిమెంట్
బాక్సింగ్​ రింగ్​లోకి దిగే ముందు తల్లిదండ్రులకి వీడియో కాల్ చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎందుకంటే లవ్లీనా ఆడే మ్యాచ్​ని వాళ్లు టీవీలో చూడరు. టెన్షన్​గా ఉండే వాళ్లని  కూల్​ చేసి, ప్రశాంతంగా రింగ్​లోకి వెళుతుంది. కామ్​గా ఉండే లవ్లీనా రింగ్​లో అడుగు పెట్టిందంటే  చురుగ్గా అడుగులేస్తూ పోటీ పడిన బాక్సర్​ని చిత్తు చేస్తుంది. బాక్సర్​గా రాణించడంలో హైట్ తనకు ప్లస్​ అయింది. 69 కిలోల బాక్సింగ్​ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయి, కాంస్యంతోనే సరిపెట్టుకుంది. అయినా కూడా... ఒలింపిక్స్​లో పతకం గెలవాలన్న తన ఎనిమిదేళ్ల కల నిజమైనందుకు లవ్లీనా పట్టలేనంత సంతోషంగా ఉంది. టోక్యో విమానం ఎక్కిన తొమ్మిది మంది బాక్సర్ల లో లవ్లీనా ఒకరు.  అయితే, అందరి కళ్లు మేరీకోమ్​ మీదే ఉన్నాయి. కానీ, మేరీకోమ్​ ఓడిపోవడంతో బాక్సింగ్​లో పతకం పోయినట్టే అనుకున్నారంతా. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యంగ్​ బాక్సర్​ లవ్లీనా కాంస్య పతకం సాధించింది. అస్సాం నుంచి ఒలింపిక్స్​కి వెళ్లిన మొదటి అమ్మాయి తనే. మొదటి ఒలింపిక్స్​లోనే పతకం గెలిచిన లవ్లీనాది అస్సాంలోని గోలాఘట్​ జిల్లాలోని బరోముఖియా. ఆమె తండ్రికి చిన్నపాటి తేయాకు తోట ఉంది. ఆమెకు రీచా, లీమా అనే  ట్విన్​ సిస్టర్స్ ఉన్నారు.  ఇద్దరూ కిక్​బాక్సింగ్​లో జాతీయ స్థాయి వరకు వెళ్లారు. వాళ్లను చూస్తూ పెరిగిన లవ్లీనా తను కూడా బాక్సర్​ అవ్వాలి అనుకుంది. వాళ్లనే ఇన్​స్ఫిరేషన్​గా తీసుకుంది​. స్కూల్​ రోజుల్లోనే ‘ముయే థాయ్​’ అనే కిక్​బాక్సింగ్​ నేర్చుకుంది.  ఒకరోజు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(శాయ్​)  వాళ్లు లవ్లీనా చదువుతున్న స్కూల్లో బాక్సింగ్​ ట్రయల్స్​ పెట్టారు. తన ప్రతిభతో అధికారుల దృష్టిలో పడింది. శాయ్​ అకాడమీలో బాక్సింగ్​ బేసిక్స్​ తెలుసుకుంది.  
ట్రైనింగ్ ట్రిప్​ మిస్​ అయ్యి..
కిందటి ఏడాది జూలైలో లవ్లీనా వాళ్ల అమ్మకి కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్​ చేశారు. ఒలింపిక్స్​ కోసం పాటియాలలోని నేషనల్​ క్యాంప్​ నుంచి పిలుపు వచ్చింది. కానీ, తల్లిని చూసుకోవాలని  వెళ్లలేదు.  యూరప్​లో 52 రోజుల ట్రైనింగ్ ట్రిప్​కి వెళ్లడానికి ముందు రోజు  లవ్లీనాకి కరోనా వచ్చింది. దాంతో ఇండియాలోనే ఉండిపోయింది. ఆ టైంలో ఖాళీ సిలిండర్​తో సాధన చేసి, ​తర్వాత స్పోర్ట్స్​ అథారిటీ వాళ్లు ఇచ్చిన ట్రైనింగ్​ కిట్​తో ప్రాక్టీస్​ చేసింది. 
కొత్త రోడ్డు వస్తోంది
లవ్లీనా వాళ్ల ఊరు మెయిన్​రోడ్డుకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెయిన్​రోడ్డుకు వెళ్లాలంటే  మట్టి  రోడ్డే దిక్కు. వానాకాలంలో  బురదగా ఉండే ఆ దారిలో బండి కాదు కదా, నడిచి వెళ్లడం కూడా కష్టమే. ఏళ్లుగా ఆ రోడ్డుకి మరమ్మతు చేసినోళ్లు లేరు. లవ్లీనా  కాంస్య పతకం గెలవడంతో  ఊరికి కొత్త రోడ్డు వేయించే పనిలో పడ్డారు లోకల్​ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆ దారి గుండానే  ఒలింపిక్​ విజేత లవ్లీనా  ఇంటికి వెళ్లాలి. ఆమె కారులో వెళ్లేటప్పుడు ఇబ్బంది పడకూడదని రోడ్డు రిపేర్​ చేయిస్తున్నారు. ఒలింపిక్​ మెడల్​తో పాటు ఊరికి రోడ్డు తెచ్చిన లవ్లీనాని  ఊరి వాళ్లంతా మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా లవ్లీనా గౌరవార్థం ఆమె పేరుతో  స్పోర్ట్స్​ అకాడమీ  కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఎమ్మెల్యే.  
కెరీర్​ ముగిసింది అనుకుని..
బాక్సర్​గా లవ్లీనా కెరీర్​ 2012లో మొదలైంది. 2018లో ఐబా ఉమెన్స్ బాక్సింగ్ చాంపియన్​షిప్​లో కాంస్యం గెలవడంతో బ్రేక్​ వచ్చింది. ఇండియా ఓపెన్​ ఇంటర్నేషనల్​ బాక్సింగ్ టోర్నమెంట్​లో గోల్డ్ మెడల్​తో సత్తా చాటింది.  కానీ,  2018 కామన్వెల్త్ పోటీల్లో ఓటమితో బాక్సింగ్​కి గుడ్ బై చెప్పేద్దాం అనుకుంది. అయితే ‘బాక్సింగ్​ అనేది మెంటల్​ గేమ్​. ఫోకస్డ్​గా ఉండాలి. ఎంత నైపుణ్యం ఉన్నా, రింగ్​లో చురుగ్గా కదలాలి’ అని కోచ్​ చెప్పాకే తనకి అర్థమైంది.  ఆ తర్వాత ఫిట్​నెస్​ మీద కంటే ధ్యానం మీద ఫోకస్​ పెట్టింది. డైరీ కూడా రాసేది. తనపై తనకు నమ్మకం పెరిగింది. అప్పటి నుంచి బరిలో దిగిన ప్రతిసారి పతకంతో తిరిగొచ్చింది. కిందటి ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది.