
న్యూఢిల్లీ: కొవిడ్ తర్వాత జనరేషన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవారు) , మిలెనియల్స్‌కు (1981–1996 మధ్య పుట్టినవారు) హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి పెరిగింది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం, 2030 నాటికి భారత హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ సైజ్ 46.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2030 నాటికి భారత జనాభాలో జనరేషన్ జెడ్, మిలెనియల్స్ వాటా 52 శాతానికి పెరగనుంది. ఇది గ్లోబల్ సగటు 46శాతం కంటే ఎక్కువ. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వీరి ప్రాధాన్యం పెరిగింది. జెన్ జెడ్, మిలెనియల్స్‌లో 61 శాతం మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నారని నీల్సన్ ఐక్యూ స్టడీలో తేలింది.
ఈ సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎక్స్‌ప్లోరింగ్ ది మిలెనియల్ అండ్ జనరేషన్ జెడ్ మైండ్‌సెట్’ పేరుతో 1,400 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో 70శాతం మంది పురుషులు, 30శాతం మంది మహిళలు పాల్గొన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, పాలసీ కొనే ముందు 37శాతం మంది ఇన్సూరెన్స్ కంపెనీతో అనుబంధం ఉన్న హాస్పిటల్ నెట్‌వర్క్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. 24శాతం మంది స్పష్టమైన, సులభమైన పాలసీ నిబంధనలను పరిగణిస్తున్నారు.
‘‘నగరాల వారీగా వినియోగదారుల అంచనాలు మారుతాయి. కానీ నాణ్యమైన సేవలు, సరసమైన ధరలు, ఫ్రీ హెల్త్ చెకప్స్, ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్, క్యాష్‌లెస్ క్లెయిమ్స్ వంటి వాటికి అన్ని చోట్ల ప్రయారిటీ ఇస్తున్నారు” అని నీల్సన్ రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడంలో ఆస్పత్రి నెట్‌వర్క్, క్లెయిమ్ ప్రాసెస్ సులభత, కవరేజ్ ఎంపికలను పరిగణిస్తున్నారని, హెల్త్ కవర్ ఉన్నవారిలో సులభమైన పాలసీ రెన్యువల్ ప్రాధాన్యతగా నిలిచిందని వివరించింది.