నాలుగేండ్ల తరువాత.. ఇంటికి చేరుకున్న కూతురు

నాలుగేండ్ల తరువాత.. ఇంటికి చేరుకున్న కూతురు

కొత్తకోట, వెలుగు : మతిస్థిమితం సరిగా లేక నాలుగేండ్ల కింద తప్పిపోయిన యువతి తిరిగి తన ఇంటికి చేరుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి దేవరకుంట సర్వలమ్మ, కర్రెన్న దంపతుల కూతురు గీరమ్మ (30) మతిస్థిమితం కోల్పోయి నాలుగేండ్ల కింద తప్పిపోయింది. కుటుంబ సభ్యులు రెండేండ్ల పాటు వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. అయితే, ముంబైకి చెందిన శ్రద్ధా ఫౌండేషన్..  ముంబైలో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న గీరమ్మను గుర్తించి ట్రీట్ మెంట్  చేయించింది.

కోలుకున్న తర్వాత తన వివరాలను గీరమ్మ.. శ్రద్ధా ఫౌండేషన్  ప్రతినిధులకు చెప్పింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యుల వద్ద చేర్చడానికి ఫౌండేషన్  నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గీరమ్మను ఆదివారం గ్రామానికి తీసుకువచ్చి ఆమె పేరెంట్స్​కు అప్పగించారు. తప్పిపోయిన కూతురు నాలుగేండ్ల తరువాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శ్రద్ధా ఫౌండేషన్ ​ప్రతినిధి ప్రదీప్  కుమార్ మాట్లాడుతూ మతిస్థిమితం లేని వారు కనిపిస్తే తమ సంస్థ ఆధ్వర్యంలో వైద్యం ఇప్పిస్తామన్నారు. వారు కోలుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.