ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించిన యూత్ కాంగ్రెస్

ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించిన యూత్ కాంగ్రెస్
  • ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ లీడర్లు
  • ఖాళీలు భర్తీ చేయాలంటూ డిమాండ్‌.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తత
  • లీడర్లను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు.. వాగ్వాదాలు
  • ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ లీడర్ల దాడి

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించారు. దీంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పోలీసులు, యూత్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.లీడర్లను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అరెస్టు చేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని యూత్ కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే రోడ్ల మీద తిరగనివ్వబోమని హెచ్చరించారు. కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నామని, ప్రభుత్వంతో నోటిఫికేషన్లు వేయించడానికి మరిన్ని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలా..

  • హైదరాబాద్‌‌‌‌లోని హైదర్‌‌‌‌గూడ ఓల్డ్‌‌‌‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌ను యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నేతలు ముట్టడించారు. నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ అధ్యక్షుడు మోతె రోహిత్‌‌‌‌ ఫైర్​ అయ్యారు.
  • ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు క్యాంప్ ఆఫీస్‌‌‌‌ను, గజ్వేల్‌‌‌‌లో సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌‌‌‌ను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్‌‌‌‌కు తరలించారు. మెదక్‌‌‌‌లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌‌‌‌ను ముట్టడించారు. కొందరు కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ పైకి ఎక్కి కాంగ్రెస్ జెండా ప్రదర్శించారు. హుస్నాబాద్‌‌‌‌, ఆందోల్, జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల వద్ద యూత్​ధర్నా చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లను ముట్టడించారు. భువనగిరిలో కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌పైకి చేరుకొని కాంగ్రెస్‌‌‌‌ జెండా ప్రదర్శించారు. మిర్యాలగూడ, హాలియాలో నాయకులను అరెస్ట్‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు. సూర్యాపేట, దేవరకొండ, తుంగతుర్తిలో క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ల ముట్టడికి వెళ్తున్న లీడర్లను పోలీసులు ముందే అదుపులోకి తీసుకున్నారు.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్​ క్యాంపు ఆఫీసులను ముట్టడించారు. పినపాకలో లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు.
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీస్​ల ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రామగుండం, సిరిసిల్ల ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను యూత్ కాంగ్రెస్ లీడర్లు ముట్టడించేందుకు యత్నించారు. సిరిసిల్లలో బైపాస్ దగ్గర బారికేడ్లను తోసుకుని క్యాంపు ఆఫీసు వద్దకు యూత్​ కాంగ్రెస్ లీడర్లు పరుగుతీశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి ​స్టేషన్లకు తరలించారు.
  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలు చోట్ల యూత్ కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు.
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు లీడర్లు ఆందోళనలు నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ లోకి యూత్​ కాంగ్రెస్​ లీడర్లు దూసుకెళ్లారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్‌‌‌‌‌‌‌‌లో లీడర్లను ముందస్తుగా  అరెస్టు చేశారు.
  • ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి సందర్భంగా బాలానగర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసునాయక్ కాలు విరిగింది. దీంతో ఆయన్ను హస్పిటల్‌‌‌‌కు తరలించి ట్రీట్‌‌‌‌మెంట్ చేయించారు. అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మిడ్జిల్, బాలానగర్, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్ మండలాల కార్యకర్తలు ఆందోళనలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లీడర్లను అదుపులోకి తీసుకున్నారు.
  • వికారాబాద్‌‌‌‌ జిల్లాలో పోలీసుల కన్నుగప్పి ఎన్ఎస్‌‌‌‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వరండాలో బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు స్టేషన్‌‌‌‌కు తరలించారు.
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. యూత్ కాంగ్రెస్ లీడర్స్‌‌‌‌పై టీ‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ నాయకులు దాడులు చేశారు. మార్గ మధ్యలోనే అడ్డుకుని, రాళ్లు, కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కార్లు ధ్వంసం అయ్యాయి. టీ‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ లీడర్లు పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌లో మంత్రి కేటీ‌‌‌‌ఆర్ పర్యటన ఉండటంతో శనివారం తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. హయత్ నగర్‌‌‌‌‌‌‌‌లో రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు చిలుక మధుసూదన్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు.

పరిగిలో గుండెపోటుతో నిరుద్యోగి మృతి

పీజీ చదివాడు. ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కుటుంబపోషణ కోసం టీ కొట్టు పెట్టుకున్నాడు. ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మానసిక వేదనకు గురయ్యాడు. చివరికి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండలంలో చోటుచేసుకుంది. మక్త వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వెంకట్య, భామిని బాయి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. పెద్దవాడైన కేతావత్ సుభాష్ (35) పీజీ, బీఈడీ చదువుకున్నాడు. భార్య కూడా బీఈడీ పూర్తి చేసింది. హైదరాబాద్‌‌‌‌లో టీ కొట్టు నడుపుకుంటూ ఉద్యోగం కోసం భార్యాభర్తలు ప్రిపేర్ అవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత చాతీలో నొప్పి వస్తోందని సుభాష్ తన భార్యతో చెప్పాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శనివారం అంత్యక్రియల కోసం మక్త వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌కు డెడ్‌‌‌‌బాడీని తీసుకొచ్చారు. ముగ్గురు చెల్లెళ్ల  పెళ్లిళ్లు చేయడంతో సుమారు 15 లక్షల అప్పు అయ్యిందని బంధువులు చెప్పారు.