కనుమరుగవుతున్న నాటుకోళ్లు.. పెంపకంతో మస్త్ లాభాలు

కనుమరుగవుతున్న నాటుకోళ్లు.. పెంపకంతో మస్త్ లాభాలు

ఒకప్పుడు పల్లె కోడికూతతో నిద్రలేచేది. గ్రామీణులకు అదే అలారమయ్యేది. నాడు పల్లెల్లో ఏ ఇంట చూసినా పదుల సంఖ్యలో నాటు కోళ్లు కనిపించేవి. ఇంట్లో మనుషులతో పాటే తిరిగేవి. నాలుగు గింజలు చల్లి బొబ్బొబ్బొ.. అంటే ఇంటిముందు వాలిపోయేవి. మనిషికీ, కోళ్లకు ఉన్న అనుబంధం అలాంటిది మరి. పల్లెసీమల జీవన చిత్రం మారిన నేపథ్యంలో నేడు కోడి కూత వినిపించడమే గగనమైంది. కోళ్లు కనిపించని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.

క్రమంగా కోడి ఊరికి దూరమవుతోంది. కోడి కూస్తేనే పల్లె నిద్ర లేచేది.ఇది ఒకనాటి మాటగా, పాత పాటగా మారిపోయింది. వీకెండ్ అయినా ఇంటికి చుట్టాల్లొచ్చినా కోడిని కోయాల్సిందే. ఇలా నాటుకోడి పల్లెమనిషితో అల్లుకపోయింది. కానీ కాలక్రమంలో పరిస్థితి మారిపోయింది. ఇండ్లలో కోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం తినాలనుకున్నా నాటు కోడి దొరకని పరిస్థితి. నాటుకోడి దొరకకపోవడంతో ఫారం కోళ్లే గతి అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ప్రత్యేకంగా నాటుకోళ్ల పెంపకం చేపడుతున్నారు. అయితే ఊళ్లలో పెరిగిన కోళ్లకు, ఫాంలో పెరిగి కోళ్లకు తేడా ఉంది.

నల్లగొండ జిల్లాలో ముగ్గురు మిత్రులు కలిసి నాటుకోళ్లను పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నారు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం పిన్నాపురానికి చెందిన చక్రి, శ్రీనాథ్, వెంకట్ రెడ్డి. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వెళ్లారు. కొంతకాలం పాటు ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. అదే సమయంలో కరోనా రావడంతో తప్పనిసరి పరిస్థితిలో ముగ్గురు మళ్లీ ఊరిబాట పట్టారు. ఇంటికొచ్చాక కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుని.. నాటుకోళ్లను పెంచాలని డిసైడైయ్యారు.
 
అలా మొదట 500 కోళ్లను పెంచారు. వాటికి బాగా గిరాకీ రావడంతో మంచి లాభాలు వస్తున్నాయి. ఇలా ఉద్యోగాల కంటే స్వయం ఉపాధి  బెస్ట్ అంటున్నారు ఈ కుర్రాళ్లు. పల్లెల్లో నాటు కోళ్ళ సంఖ్య తగ్గిపోవడాన్ని ప్రభుత్వం గుర్తించింది. పల్లె వాసులకు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుగా ఉన్న నాటు కోళ్ల పెంపకంపై దృష్టి సారించింది. పశుసంవర్థక శాఖ ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఆసక్తి ఉన్నవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.