
నేరెడ్మెట్, వెలుగు: ర్యాష్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేసి ఫ్రెండ్ మృతికి కారకుడైన నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మల్కాజిగిరి స్పెషల్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. నేరెడ్ మెట్ లోని సీపీ ఆఫీసులో సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు. కీసర మండలంలోని దమ్మాయిగూడలో ఉండే హజరి ప్రక్షిత్(22) 2016 డిసెంబర్ 9న రాంపల్లి విలేజ్ కి చెందిన తన ఫ్రెండ్ కురెళ్లి శశిధర్ రెడ్డి(22)తో కలిసి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై బయటికి వెళ్లాడు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో రాధిక చౌరస్తా నుంచి దమ్మాయిగూడకి తిరిగి వెళ్తున్నారు. కాప్రా మెయిన్ రోడ్డులోని రాఘవేంద్ర హోటల్ మలుపు వద్ద ఓవర్ స్పీడ్ తో బైక్ అదుపుతప్పి కిందపడింది. దీంతో ప్రక్షిత్,శశిధర్ రెడ్డి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. బైక్ వెనుక కూర్చున్న శశిధర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ లో 4 రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకుని శశిధర్ రెడ్డి చనిపోయాడు. కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చార్జిషీట్ ను మల్కాజిగిరి కోర్టుకు సబ్ మిట్ చేశారు. గురువారం చార్జిషీట్ ను పరిశీలించిన స్పెషల్ కోర్టు జడ్జి ఓవర్ స్పీడ్ తో బైక్ డ్రైవ్ చేసిన హజరి ప్రక్షిత్ కి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చినట్టు సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు.