సోషల్ మీడియాలో 'షోఆఫ్'.. అర్ధరాత్రి యూట్యూబర్ ఇంట్లో దొంగల భీభత్సం.. రూ.7 లక్షలు చోరీ!

సోషల్ మీడియాలో 'షోఆఫ్'.. అర్ధరాత్రి యూట్యూబర్ ఇంట్లో దొంగల భీభత్సం.. రూ.7 లక్షలు చోరీ!

సోషల్ మీడియాలో మనకున్న కాస్తో కూస్తో లగ్జరీని చూపించుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఓ మహిళా యూట్యూబర్‌కు మాత్రం ఆ అలవాటే కోలుకోలేని దెబ్బ కొట్టింది. తనకున్న బంగారం, వెండి ఆభరణాలను, లగ్జరీ లైఫ్‌ను వీడియోల్లో తెగ చూపించేసరికి.. దొంగల కన్ను ఆమెపై పడింది. స్కెచ్ వేసి మరీ అర్ధరాత్రి టైంలో  ఆమె ఇంట్లో దూరి దాదాపు 7 లక్షల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగింది.

అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌కు చెందిన రచనా గుర్జర్ అనే మహిళా యూట్యూబర్ గ్రామంల్లో ఉంటూనే తన లగ్జరీ లైఫ్ స్టయిల్  వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. అయితే, ఈ వీడియోలు చూసిన దొంగలు ఆమె ఇంటిని టార్గెట్ చేశారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు చాలా ప్లాన్‌గా రంగంలోకి దిగారు. మొదట ఇంటి చుట్టూ ఉన్న కంచెను కట్ చేసి లోపలికి వెళ్లి..  ఆ తర్వాత రచనా గుర్జర్, ఆమె భర్త పడుకున్న గదికి బయట నుంచి తాళం వేశారు. ఇంకా ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాలను పైకి తిప్పేసి, వాళ్ల ముఖాలు రికార్డ్ కాకుండా జాగ్రత్తపడ్డారు.

ఇంట్లో ఈజీగా  చొరబడిన దొంగలు అల్మారాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. దాదాపు రూ.1,91,000 క్యాష్, బంగారు నగలు, వెండి ఆభరణాలతో పాటు విలువైన గ్యాడ్జెట్లను దొంగిలించారు. విచిత్రం ఏంటంటే.. ఇంట్లో ఉన్న 'రెడ్ బుల్' ఎనర్జీ డ్రింక్ లను కూడా దొంగలు వదలకుండా పట్టుకెళ్లిపోయారు.

తెల్లవారుజామున తెలిసిన నిజం 
తెల్లవారుజామున 4 గంటల సమయంలో దాహం వేసి రచనా గుర్జర్ నిద్ర లేచింది. తలుపు తీద్దామంటే బయట నుంచి లాక్ చేసి ఉంది. దాంతో ఆమెకు అనుమానం వచ్చి గట్టిగా అరవడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన ఆస్తుల విలువ మొత్తం  7 నుంచి  8 లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు.

ALSO READ : ఇకపై రెండు నెలలకు ఒకసారి..

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యూట్యూబర్
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న  సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కాలంలో సోషల్ మీడియాలో మన పర్సనల్ విషయాలు, ఆస్తుల వివరాలు ఎక్కువగా షేర్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది!